మయన్మార్ (Myanmar)లో గత కొద్దిరోజులుగా అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దీంతో భారతీయులను అక్కడికి వెళ్లొద్దని ఇప్పటకే కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉంటే మయన్మార్ నుంచి కొందరు సైనికులు సరిహద్దులను దాటి భారత్ (India)లోకి ప్రవేశిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య యథేచ్ఛగా జరుగుతున్న రాకపోకలను నిలిపివేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం ‘ఎక్స్ (ట్విటర్)’ వేదికగా ప్రకటన చేశారు.
ఇండో-మయన్మార్ సరిహద్దులను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా అంశం తదితర కారణాల దృష్ట్యా భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని రద్దు చేయాలని హోంశాఖ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆ దిశగా చర్యలు మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు.
చొరబాట్లను అరకట్టేందుకు సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించనున్నట్లు అమిత్ షా ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే మణిపుర్‌లోని మోరేలో 10 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. హైబ్రిడ్ నిఘా వ్యవస్థద్వారా మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి:Actress Murdered: మందుకు డబ్బివ్వలేదని కొడుకు చేతిలో నటి దారుణ హత్య