Election Commission: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక చోటే పోటీ చేసేలా కొత్త నిబంధనను తీసుకురావాలని కసరత్తు చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ లేఖ రాశారు. వచ్చే ఎన్నికల నుంచి ఈ నిర్ణయాలు అమలు చేసేలా ప్రయత్నించాలని లేఖలో సూచించారు. ప్రస్తుతం ఎన్నికల్లో అర్హత ఉన్న ఒక అభ్యర్థి రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. 2014, 2019 ఎన్నికలలో ప్రధాని మోదీ.. 2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. మోదీ వడోదర, వారణాసి నుంచి.. రాహుల్ గాంధీ అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేశారు. కానీ భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి లేకుండా చేసేందుకు చెక్ పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
Read Also: Kidnap: పాకిస్థాన్ సీనియర్ మంత్రి కిడ్నాప్.. విడుదల
కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ లేదా లోక్ సభ ఎన్నికల్లో రెండేసి స్థానాల్లో పోటీ చేయడమే కాకుండా పదవిలో ఉండగానే పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ ఎన్నికల్లో, అసెంబ్లీకి ఎన్నికైన వారు లోక్ సభలో పోటీ చేయడం వల్ల కూడా ఉప ఎన్నికలు అనివార్యం అవుతున్నాయి. నిజానికి ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ అసెంబ్లీ లేదా లోక్ సభ స్థానాల్లో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. కానీ వివిధ కారణాలతో ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనను బుట్టదాఖలు చేశాయి. రెండు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థి రెండు స్థానాల్లో గెలుపొందితే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుండటంతో ఉప ఎన్నిక అనివార్యం అవుతోంది. ఉప ఎన్ని్క నిర్వహణ కోసం ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. ఫలితంగా ప్రజాధనం వృథా అవుతుందన్న విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఒకే స్థానంలో పోటీ చేయాలనే నిబంధన తీసుకురావడం లేదా రెండు స్థానాల్లో గెలిచి ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటే సదరు అభ్యర్థి నుంచి భారీ జరిమానా వసూలు చేసేలా నిబంధన తీసుకురావాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.