బుధవారం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో ఓట్ల జాతర జరగనున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుత సమాజం రాకెట్ యుగంలో దూసుకెళ్తోంది. ఈ జనరేషన్‌లో మొబైల్ ఉపయోగించనివాళ్లే ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏది ఉన్నా.. లేకున్నా ప్రతి పౌరుడి చేతిలో మాత్రం ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి మనిషికి మొబైల్ అనేది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో ఎన్నికల స్టంటో.. లేదంటే దేశీయంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలను ప్రోత్సహించేందుకో తెలియదు గానీ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇండియాలో ఆయా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు స్థానికంగా మొబైలను తయారు చేయాలంటే కచ్చితంగా అందుకు అవసరమయ్యే విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలా దిగుమతి చేసుకున్న కంపెనీలు ప్రభుత్వానికి 15 శాతం దిగుమతి సుంకాన్ని చెల్లిస్తోంది. తాజాగా ఈ సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే ఎల్‌సీడీ ప్యానెల్‌ల డిస్‌ప్లే భాగాలకు కూడా 10 శాతం సుంకం తగ్గిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం ద్వారా యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఎగుమతులు పెంచడంలో సహాయపడుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ తయారీ మార్కెట్‌లో కీలక పాత్రపోషిస్తున్న చైనా, వియాత్నాం వంటి దేశాలతో ఇండియా పోటీపడేందుకు కూడా అవకాశంగా మారుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏవేవి తగ్గనున్నాయంటే..
సిమ్ సాకెట్, బ్యాటరీ కవర్, మెయిన్ కవర్, స్క్రూలు, జీఎస్‌ఎం, యాంటెన్నా వంటి మెకానికల్, ప్లాస్టిక్ ఇన్‌పుట్ భాగాలతో పాటు ఇతర మొబైల్ ఫోన్ విడి భాగాలపై దిగుమతి సుంకం తగ్గనుంది.