CDSCO Drug Alert: తాజాగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెప్టెంబర్ నెలకు “డ్రగ్ అలర్ట్” జారీ చేసింది. CDSCO నివేదిక ప్రకారం.. 112 డ్రగ్ నమూనాలు ప్రామాణిక నాణ్యత (NSQ) కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే ఈ పరీక్షల్లో ఒక డ్రగ్ నమూనా నకిలీదని తేలినట్లు పేర్కొన్నారు. ఇంతకీ డ్రగ్ నమూనాలు ప్రామాణిక నాణ్యత అంటే ఏంటో తెలుసా? ఈ స్టోరీలో తెలుసుకుందాం…
NSQ అంటే ఏమిటి?
ఒక ఔషధం ఒక నిర్దిష్ట నాణ్యతా ప్రమాణంలో విఫలమైనప్పుడు మాత్రమే “ప్రామాణిక నాణ్యత లేనిది” లేదా NSQగా పేర్కొంటారని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష ఒక నిర్దిష్ట బ్యాచ్‌పై జరుగుతుంది. ఒక బ్యాచ్ విఫలమైతే ఆ ఔషధం అన్ని ఇతర బ్యాచ్‌లు లేదా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఔషధం కూడా నాసిరకంగా ఉన్నాయని అర్థం కాదని పేర్కొన్నారు. తాజాగా కేంద్ర ప్రయోగశాలలలో 52 నమూనాలు, రాష్ట్ర ప్రయోగశాలలలో 60 నమూనాలు నాసిరకంగా ఉన్నాయని CDSCO ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. అలాగే ఛత్తీస్‌గఢ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఒక ఔషధం నకిలీదని వెల్లడైనట్లు CDSCO పేర్కొంది. దీనిని మరొక కంపెనీ పేరుతో అనధికార తయారీదారు తయారు చేసినట్లు వివరించారు. దీనిపై ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపింది.
ప్రతి నెల ఔషధ పరీక్షలు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. రాష్ట్రాల సహాయంతో ఇటువంటి ఔషధ నమూనాలను నెలవారీగా సేకరిస్తారు. పరీక్ష సమయంలో ఏదైనా నాణ్యత లేని లేదా నకిలీ ఔషధాన్ని గుర్తిస్తే వెంటనే మార్కెట్ నుంచి వాటిని తొలగిస్తారు. ఈ ఔషధాల పరీక్షలు అనేవి ప్రతినెల నిర్వహస్తారు. లైసెన్స్ పొందిన మెడికల్ స్టోర్లు లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రుల నుంచి మాత్రమే మందులు కొనుగోలు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్యాకేజింగ్ లేదా లేబుల్‌లో ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే, వెంటనే స్థానిక ఔషధ నియంత్రణ అధికారికి సమాచారం అందించాలని తెలిపింది.
READ ALSO: Bihar Elections 2025: బీహార్ కురుక్షేత్రంలో బీజేపీ కోటను ఆర్జేడీ బద్దలు కొడుతుందా?