YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉత్కంఠ రేపుతోంది.. ఈ రోజు మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఇప్పటికే ఆరు సార్లు ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.. ఇక, మరోసారి విచారణకు హాజరుకావాలంటూ.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు.. దీంతో.. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు..
Read Also: YSR Matsyakara Bharosa Scheme: గుడ్‌న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు
మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. కానీ, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.. వివేక హత్య కేసులో 20 రోజుల తర్వాత మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేయడం.. ఈ రోజు ఆయన సీబీఐ ముందుకు రానుండడంతో.. ఇవాళ్టి విచారణపై ఉత్కంఠ రేగుతోంది.. సీబీఐ నోటీసులతో.. పులివెందల, లింగాలలో జరగబోయే కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి.. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.
ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసు డైరీని కోర్టుకు సమర్పించారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పై బయటికొస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని సీబీఐ వాదించింది. వివేకా హత్య కేసులో ఉదయ్ ప్రమేయంపై ఆధారాలు ఉన్నాయని, అందుకే అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది. అదే విధంగా ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ మరోసారి కోర్టుకు తెలిపింది. ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసిన విషయం విదితమే.. అయితే, మరోసారి అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడంతో.. ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు.. ఎలాంటి పరిస్థితులు వస్తాయి.. ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకోనుంది అనేది ఉత్కంఠగా మారింది.