Pakadwa Vivah: పురాతన కాలంలో రాక్షస వివాహం, గంధర్వ వివాహం అనేవి చూశాం. రాక్షస వివాహంలో బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. అయితే ఇలాంటి వివాహాలు ఇప్పటికే బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి. తమ కూతుళ్లు వివాహం చేసే స్థోమత లేకపోవడం, బాగా సెటిల్ అయిన వ్యక్తిని చూసి అతడిని కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. బీహార్ ప్రాంతంలో ఇలాంటి పెళ్లిళ్లను ‘పకడ్వా వివాహం’గా పిలుస్తుంటారు.
తాజాగా బీహార్ రాష్ట్రంలో గౌతమ్ కుమార్ అనే వ్యక్తిని ఇలాగే కిడ్నాప్ చేసి, కిడ్నాపర్ తన కుమార్తెకి ఇచ్చి బలవంతంగా పెళ్లి జరిపించాడు. ఇప్పుడు ఈ విషయం ఆ రాష్ట్రంలో హాట్ టాపిగ్‌గా మారింది. గౌతమ్ కుమార్ ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, టీచర్ ఉద్యోగం పొందాడు. బుధవారం పాఠశాలకు వచ్చిన నలుగురు వ్యక్తులు గౌతమ్ కుమార్‌ని కిడ్నాప్ చేసి, 24 గంటల్లోనే గన్ గురిపెట్టి, అందులో ఒక కిడ్నాపర్ కుమార్తెతో వివాహం జరిపించారు.
Read Also: RBI: ఆర్బీఐకి చేరిన 2వేల రూపాయల నోట్లు.. ఇంకా ఎంత చేరాలంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ వైశాలి జిల్లాలో ఈ కిడ్నాప్ కథ జరిగింది. గౌతమ్ కుమార్‌కి పతేపూర్‌లోని రేపురాలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయంలో జాబ్ వచ్చింది. అక్కడి నుంచి అతడిని కిడ్నాప్ చేశారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు వెతకడం ప్రారంభించారు. అంతకుముందు కుమార్ కోసం అతని కుటుంబం బుధవారం రాత్రి రోడ్డును దిగ్భంధించి నిరసన తెలిపింది.
గౌతమ్ కుమార్ కుటుంబం రాజేష్ రాయ్ అనే వ్యక్తే కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు. ఇతనే గౌతమ్‌ని బలవంతంగా ఎత్తుకెళ్లి తన కుమార్తె చాందినితో వివాహం చేశారని ఆరోపించారు. పెళ్లి చేసుకోవడానికి అంగీకరించని గౌతమ్‌ని శారీరకంగా హింసించారు. అయితే ఇటీవల పాట్నా హైకోర్టు, నవడాలోని ఆర్మీ వ్యక్తిని, లఖిసరాయ్‌ల మధ్య జరిగిన బలవంతపు పెళ్లిని రద్దు చేసిన విషయాన్ని గౌతమ్ కుమార్ చెప్పాడని పోలీసులు తెలిపారు. కిడ్నాపర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బీహార్ ప్రాంతంలో పకడ్వా వివాహం అసాధారణం కాదు. గతేడాది అనారోగ్యంతో తమ జంతువులు బాధపడుతున్నాయని ఓ వెటర్నరీ డాక్టర్‌ని పిలిపించి, కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. ఈ ఘటన బెగుసరాయ్ లో జరిగింది. అంతకుముందు 29 ఏళ్ల ఇంజనీర్‌ని ఇలాగే కొట్టి బలవంతంగా ఓ యువతితో వివాహం జరిపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.