టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. భూమనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్‌ల కింద భూమనపై ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్వీ గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భాను ప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘ఎస్వీ గోశాలపై భూమన అసత్య ప్రచారం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన వ్యవహరించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో బయట పెట్టాం. భూమన మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. భూమన హయాంలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి, పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారు. అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది’ అని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.