Cameron Green holds the Worst Record in ODI’s: ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్; 37 బంతుల్లో 6×4, 6×6)ల దాటికి ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. భారత బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. దాంతో ఆస్ట్రేలియాపై వన్డేల్లో భారత్ అత్యధిక స్కోర్ నమోదు చేసింది.
భారత బ్యాటర్ల ధాటికి ఆస్ట్రేలియా పేసర్ కెమరూన్ గ్రీన్ ఓ చెత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున మూడో చెత్త బౌలింగ్ గణాంకాలను (పరుగుల పరంగా) నమోదు చేశాడు. రెండో వన్డేలో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్రీన్.. రికార్డు స్థాయిలో 103 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో మిక్ లెవిస్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లెవిస్ 113 పరుగులు ఇచ్చాడు. ఆసీస్ తరఫున అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన ఇదే. ఈ నెలలోనే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడమ్ జంపా 113 పరుగులు సమర్పించుకుని.. ఆసీస్ తరఫున రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇండోర్ వేదికగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో కెమరూన్ గ్రీన్ 103 పరుగులు సమర్పించుకుని ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఆండ్రూ టై 100 పరుగులు సమర్పించుకుని నాలుగో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో ఆసీస్ తరఫున ఓ ఇన్నింగ్స్‌లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు ఈ నలుగురే. ఇక వన్డేల్లో భారత్‌పై అత్యంత చెత్త ప్రదర్శన జాబితాలో శ్రీలంక బౌలర్ నువాన్ ప్రదీప్ (0/106) మొదటి స్థానంలో ఉన్నాడు. కివీస్ పేసర్ టిమ్ సౌథీ (0/105) రెండో స్థానంలో ఉండగా.. కెమరూన్ గ్రీన్ (2/103) మూడో స్థానంలో ఉన్నాడు.