Site icon NTV Telugu

Call 108 For Lift: మా అత్తగారింట్లో దించండి సార్‌.. తప్పతాగి అర్థరాత్రి 108కు ఫోన్

Ambulance

Ambulance

Call 108 For Lift: అత్తగారింటికి వెళ్లేందుకు మద్యం మత్తులో 108కు కాల్ చేశాడు ఓ మందుబాబు. తప్పతాగి అర్థరాత్రి 108కు మందు బాబు ఫోన్ చేసిన ఘటన హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రాయగిరిలో చోటుచేసుకుంది. కాళ్లలో నొప్పి వేస్తోందని, నడవలేకపోతున్నానని ఓ వ్యక్తి 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. దీంతో క్షణాల్లో ఫోన్ చేసిన వ్యక్తి వద్దకు యాదగిరిగుట్ట 108 వాహనం చేరుకుంది. అయితే అతడి ఆరోగ్యం బాగానే ఉందని, కేవలం లిఫ్ట్ కోసమే కాల్ చేశాడని అంబులెన్స్‌లోని సిబ్బందికి అర్థం అయ్యింది. అంబులెన్స్ సిబ్బంది, అతడికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: CM Revanth Reddy : మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దాం.. ఈ బడ్జెట్లోనే వాటికి నిధుల కేటాయింపు

అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్న కె.రమేష్ అనే వ్యక్తి జనగామలోని తన అత్తగారింటికి వెళ్లాలని కాలినడకన వెళ్లాలని భావించాడు. అయితే 40 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన భువనగిరికి చేరుకున్నాడు. కాళ్లు నొప్పి వేయడంతో ఫ్రీగా అత్తగారింటికి వెళ్లాలనే ఉద్దేశంతో ఏకంగా అంబులెన్స్‌కు కాల్ చేశాడు. ఏదో ఎమర్జెన్సీ ఉందని భావించిన అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని గుర్తించి అవాక్కయ్యారు. అతడిని ఎందుకు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశావని సిబ్బంది ప్రశ్నించారు. తాను నడవలేకపోతున్నానని, ఎప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతానో తెలియదని ఆ వ్యక్తి చెప్పాడు. తనకు జనగామ వరకు లిఫ్ట్‌ ఇవ్వాలని, జనగామలో తాను వెళ్లాలనుకున్న ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదని చెప్పాడు. అతడి మాటలు విన్న అంబులెన్స్‌ సిబ్బంది ఆశ్చర్యపోయారు.

Read Also: Protest : పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు ట్రాక్టర్ డ్రైవర్లు నిరసన

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించడానికే అంబులెన్స్‌ను వినియోగించాలని ఆ వ్యక్తికి సిబ్బంది వివరించారు. కానీ రమేష్ వారిని సులభంగా వదలలేదు. తాను తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్నానని, అంబులెన్స్‌లో జనగామకు తరలించాలని కోరారు. అయితే దానిని సిబ్బంది తిరస్కరించారు. కాళ్ల నొప్పులు వస్తే భువనగిరి ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్తామని చెప్పారు. అయినా అక్కడికి వద్దని రమేష్ తిరస్కరించాడు. తన చేతిలో రాడ్‌ ఉందని, అలసటతో పాటు నొప్పిగా ఉందని వేడుకుంటూ జనగామలో దింపాలని పట్టుబట్టాడు. మందు బాబును జనగామలో దింపడానికి నిరాకరించి… భువనగిరి ఆసుపత్రిలో చేర్పిస్తామని చెప్పినా మందుబాబు వినిపించుకోలేదు. ఈ క్రమంలో అంబులెన్స్‌ సిబ్బంది అతనికి నచ్చజెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Exit mobile version