Good News For Unemployed: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. మరికొన్ని పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి చెల్లుబోయిన వేణు.. వివిధ శాఖల్లో 6,840 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 2014 జూన్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణకు ఆమోదం లభించిందన్నారు.. ఏపీ ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ రద్దు.. ఏపీవీవీపీలోని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని వెల్లడించారు. సీపీఎస్ రద్దు చేసి.. జీపీఎస్ అమలుకు నిర్ణయం తీసుకున్నామని.. సీపీఎస్ రద్దు చేసి పెన్షన్ గ్యారెంటీ స్కీం అమలు చేస్తామని.. పదవీ విరమణ నాటికి ఉద్యోగి జీతంలో 50 శాతం పెన్షనుగా ఇస్తామని పేర్కొన్నారు..
ఏడాదికి రెండుసార్లు డీఆర్ సవరణ ఇస్తాం.. జీపీఎస్ విధానం దేశానికే ఆదర్శం అన్నారు మంత్రి వేణు.. మూడో తరగతి చదివే విద్యార్ధులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం.. దీని కోసం టోఫెల్ కోచింగ్ ఇస్తామన్నారు.. ఇక, మూతపడిన చిత్తూరు డెయిరీకి చెందిన భూములను అమూల్ సంస్థకు 99 ఏళ్లపాటు లీజ్ కు ఇచ్చామని తెలిపారు.. మరోవైపు.. కొత్త మెడికల్ కాలేజీలకు 2,100 పోస్టుల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.. జూన్ 28వ తేదీన అమ్మఒడి, జూన్ 12న విద్యా కానుక కిట్ల పంపిణీ.. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ బాధ్యత ఆలయ ధర్మకర్తలకు అప్పజెప్పాలని నిర్ణయించామన్న ఆయన.. నిర్వహణ సరిగా లేకుంటే తిరిగి వాటిని దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని స్పష్టం చేశారు మంత్రి వేణు.. 2024లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు.. టీడీపీ కేడర్ జారిపోతున్నారు.. అందుకే టీడీపీ ముందస్తు ఎన్నికలు అని ప్రచారం చేస్తుందని కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. కాగా, సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మొత్తం 63 అంశాలకు ఆమోదం లభించింది.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తీసుకొస్తోంది. ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం అమలుకు ఆమోదం తెలిపింది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ గ్యారెంటీ పెన్షన్ స్కీం బిల్లు ముసాయిదాను ఇవాళ కేబినెట్ భేటీలో ఆమోదించింది. ఉద్యోగుల భద్రత కోసం సీపీఎస్ స్థానంలో ఏపీ జీపీఎస్ బిల్లు తీసుకొచ్చినట్లు ప్రకటించింది. పాత ఫించను పథకానికి సమానండే ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత వచ్చే 50 శాతం ఫించనకు తగ్గకుండా, డీఏ క్రమంగా పెరిగేలా కొత్త విధంగా కొత్త బిల్లును రూపొందించారు. గ్యారెంటెడ్ పెన్షన్ బిల్ 2023 పేరుతో బిల్లు ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది.
10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదంతో పాటు సంక్షేమ పథకాలైన అమ్మ ఒడి పథకం, జగనన్న ఆణిముత్యాలు పథకంతో పాటు ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, అలాగే పీఆర్‌సీ ఏర్పాటునకు, కొత్త డీఏ అమలునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,840 కొత్త పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందులో పోలీస్ బెటాలియన్ ఖాళీలు 3,920 పోస్టులు ఉన్నాయి. అలాగే కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇక, బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ ఉద్యోగులకు, కో-ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టులకు, కడప మానసిక వైద్య కళాశాలలో 116 పోస్టులకు, సీతానగరం పీహెచ్‌సీ అప్‌గ్రేడ్‌కు 23 పోస్టులకు, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. డయాలసిస్ యూనిట్‌కు 41 మెడికల్ ఆఫీసర్లకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టులకు ఆమోదముద్ర వేయగా.. గ్రూప్-1, 2 పోస్టుల నియమకాలకు లైన్ క్లియర్ అయ్యింది. అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ ఈఈ పోస్టును ఈఈగా అప్‌గ్రేడ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.