బీజేపీ ప్రజల నుంచి ఒంటరవుతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మొన్నటి ఐదురాష్ట్రాల ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులొట్టబోయి బయట పడిందన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. రాబోయే కాలంలో మత పరంగా ప్రజలను విభజించి అధికారంలోకి రావాలని చూస్తోంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతిలను ఘర్షణలకు ఉపయోగించుకుంది.
రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. లౌకిక శక్తులన్నీ కలిసొచ్చి మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి రావాలన్నారు. బీజేపీ మతోన్మాద శక్తులకు ఏపీలో రాజకీయ పార్టీలు పరోక్షంగా పని చేస్తున్నాయి. జనసేన పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్నుంచి మతోన్మాద శక్తులతో కలిసే పని చేస్తుంది. ఇప్పటికైనా అందరూ కలిసి మతోన్మాద శక్తులపై కలిసి పోరాడాలి.
వైసీపీ, టీడీపీ, జనసేన లౌకిక పార్టీలో కాదో తేల్చుకోవాలి. ఏపీలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. పల్లెల నుంచి పట్టణాల వరకూ చెత్తకు కూడా పన్ను వసూలు చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిపివేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు బదిలీని మేం వ్యతిరేకిస్తున్నాం కేంద్రం ఒత్తిడితో వైసీపీ చాలా ఉత్సాహంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోంది.
వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అందరికంటే ముందే ఏపీలో అమలు చేశారు. డిస్కంలను ప్రైవేటీకరణ చేయడం కేంద్రం ఒత్తిడిలో భాగమే అన్నారు బీవీ రాఘవులు. వైసీపీ ప్రజా పక్షమా..? కేంద్రం పక్షమా..? ఏపీలో విశాలమైన ఉద్యమం చేయకముందే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి. రేషనుకు బదులు నగదు బదిలీ పథకానికి ప్రజలెవరూ అంగీకరించొద్దు. రేషన్ నగదు బదిలీకు అనుమతి పత్రాలివ్వొద్దు. కోర్టుల్లో డాక్యుమెంట్లను దొంగిలించడం దురదృష్టకరం. ఈ ఘటనలో ఎవరిని నిందించాలి.. కోర్టులనా..? ప్రభుత్వాన్నా..? పోలీసులనా..? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Sai Ganesh: పోస్టుమార్టం చేయకుండా కాలయాపన
కోర్టులో దొంగతనం ఘటన పై ఉన్నత స్థాయి బృందాన్ని వేసి విచారణ చేయించాలి. చోరీ కేసునుపై కోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వామపక్షాలు ఐక్యంగా పోరాడుతూనే ఉన్నాయన్నారు బీవీ రాఘవులు. చిన్న చిన్న తేడాలున్నా.. ఐక్యతను కొనసాగించేలా భవిష్యత్తు ప్రణాళికలుంటాయి. అమరావతి విషయంలో గతంలో చంద్రబాబు చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నారు. 1500 ఎకరాల్లో త్వరగా భవనాలు పూర్తి చేసి గృహప్రవేశం చేయమని చంద్రబాబుకి ఆనాడే చెప్పాం అన్నారు బీవీ రాఘవులు.