Business Headlines 08-05-23:
విశాఖ.. విశేషం..
విశాఖ ఉక్కు పరిశ్రమకు ఏప్రిల్ నెల మరపురాని మాసంగా మిగిలిపోయింది. కంపెనీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించింది. నాలుగు పాయింట్ ఒకటీ తొమ్మిది లక్షల టన్నుల హాట్ మెటల్‌ని ఉత్పత్తి చేయగలిగింది. పోయినేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఇది 20 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. విస్తరించిన యూనిట్ల ద్వారా ఒకటీ పాయింట్ నాలుగు మూడు లక్షల టన్నుల ఫినిష్డ్ స్టీల్ మరియు 80 టన్నుల హైఎండ్ వ్యాల్యూ యాడెడ్ స్టీల్‌ను ఉత్పత్తి చేసింది.
ఎల్‌ఐసీకి ఏడాది
ఎల్ఐసీ ఐపీఓకి ఏడాది పూర్తయింది. అయితే.. ఈ బీమా దిగ్గజం.. పెట్టుబడిదారులను నిరాశపరిచింది. స్టాక్ మార్కెట్‌లో లిస్టయినప్పటి నుంచి ఇష్యూ ధరకి దిగువనే ట్రేడ్ అవుతూ వస్తోంది. ఇష్యూ ధర 949 రూపాయలతో పోల్చితే డిస్కౌంట్‌తో 867 రూపాయల వద్ద లిస్ట్ అయిన ఎల్ఐసీ షేరు ఒక దశలో 920 రూపాయల వద్ద గరిష్ట విలువకు చేరుకుంది. మార్చి నెల చివరి వారంలో ఘోరంగా 530కి పడిపోయింది. అంటే.. ఇప్పటివరకు 40 శాతం పతనమైంది.
మరో ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కి ఆసియా-బెర్లిన్ సదస్సు ఆహ్వానం పలికింది. వచ్చే నెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ సమావేశంలో.. కనెక్టింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనే అంశంపై మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. తద్వారా.. ఇండియాతోపాటు ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాల ఏర్పాటుకు అవసరమైన ప్రయత్నాల్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు. ముఖ్యంగా జర్మనీ స్టార్టప్‌లను ఆసియా మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
రంగారెడ్డి ఫస్ట్
వాహనాల జీవితకాల పన్ను వసూళ్లలో రంగారెడ్డి జిల్లా.. హైదరాబాదును దాటేసి ప్రథమ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా నుంచి 12 వందల 43 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రాగా హైదరాబాదు నుంచి వెయ్యీ 78 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. నగరం విస్తరిస్తుండటంతో ఎక్కువ మంది శివారు ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అడ్రస్‌లతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి.
కీలక ఆర్థిక భేటీ
ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ మీటింగ్‌కి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాక ఈ భేటీ జరుగుతుండటం ఇదే తొలిసారి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్‌తోపాటు పలు ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులతోపాటు సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ సూయిజ్ సంక్షోభాలు తదితర సమస్యలపై చర్చించనున్నారు.
గడువు పెంపు
వంద కోట్లు.. అంతకుమించి టర్నోవర్ కలిగిన వ్యాపారులు మరియు వ్యాపార సంస్థలకు జీఎస్‌టీ నెట్‌వర్క్ శుభవార్త చెప్పింది. ఈ కంపెనీల పాత ఇన్వాయిస్‌లను అప్‌లోడ్ చేసేందుకు గతంలో విధించిన వారం రోజుల గడువును ఇప్పుడు మూడు నెలలకు పొడిగించారు. ఈ అప్‌లోడింగ్‌లను బట్టే బిజినెస్‌మ్యాన్‌లు, ఎస్టాబ్లిష్‌మెంట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని క్లెయిమ్ చేసుకుంటాయి. వారం రోజులు అనేది తక్కువ సమయం కావటంతో తొలుత ఆందోళన చెందినవాళ్లు తాజా ప్రకటనతో భారీగా ఊరట పొందారు.