Gold Price: ప్రపంచ ఆర్థిక మార్కెట్లను ఇటీవల కాలంలో అనేక అంశాలు తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. ఇక, రూపాయి విలువ రికార్డు స్థాయిలో బలహీనపడటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులు ఉపసంహరించుకోవటం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి హెవీవెయిట్ కంపెనీల ఫలితాలు అంచనాలకు తగినట్లు లేకపోవడం, గ్రీన్‌ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నంతో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి లాంటి విలువైన వాటికి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి.
Read Also: RT77 : రవితేజ – శివనిర్వాణ – మైత్రి మూవీస్.. టైటిల్ “ఇరుముడి”
ఆల్‌టైమ్ హైకి చేరిన బంగారం, వెండి ధరలు:
గత ఏడాది కాలంగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. శుక్రవారం నాటికి 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1.6 లక్షల స్థాయిని దాటి కొత్త ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. సాధారణంగా అనిశ్చితి ఎక్కువగా ఉన్న కాలాల్లో ‘సేఫ్ హేవెన్’ ఆస్తిగా భావించే గోల్డ్, గత ఏడాదిలోనే దాదాపు 93 శాతం మేర పెరిగింది. ఇది పెట్టుబడిదారుల భద్రతా భావనను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బంగారం, వెండి ఆధారిత ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) కూడా ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. జనవరి 23వ తేదీన కొంత తగ్గినప్పటికీ ఈ ETFలు సుమారు 17 శాతం వరకు పెరిగాయి. సుంకాలపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గాయి.
గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు:
బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేపథ్యంలో గోల్డ్‌మన్ సాచ్స్ తన తాజా ఓ రిపోర్టును విడుదల చేసింది. 2026 చివరి నాటికి బంగారం ధర లక్ష్యాన్ని ఔన్సుకు 5,400 డాలర్లకు పెంచినట్లు పేర్కొనింది. భారతీయ ప్రమాణాల్లో ఇది 10 గ్రాములకు దాదాపు రూ.1,75,160కు సమానం అని తెలిపింది. గతంలో ఔన్సుకు 4,900 డాలర్లు (సుమారు రూ.1,58,960 / 10 గ్రాములు)గా అంచనా వేసిన గోల్డ్‌మన్, తాజా అంచనాలో 10 శాతం కంటే ఎక్కువ పెంపును సూచించారు. అయితే, బంగారం డిమాండ్ వెనక చోటుచేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పులే ప్రధాన కారణమని గోల్డ్‌మన్ పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులు, అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు సంప్రదాయ రిజర్వ్ ఆస్తులపై ఆధారాన్ని తగ్గించి, బంగారం కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.
Read Also: Penguins: నవ్వించే పెంగ్విన్లు.. కన్నీళ్లు పెట్టించే నిజం.. రిష్క్‌లో పెంగ్విన్ల భవిష్యత్తు!
ప్రైవేట్ పెట్టుబడిదారుల పాత్ర కీలకం
వరల్డ్ వైడ్ గా విధాన అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని హెడ్జ్‌గా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా 2026 వరకు ఈ డిమాండ్ తగ్గే ఛాన్స్ లేదని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో బంగారం ధరలు వేగంగా పెరిగి, దీర్ఘకాలిక బేస్ లెవెల్‌ను తాకే ప్రమాదం ఉంది. అలాగే, పాశ్చాత్య మార్కెట్ల నుంచి కూడా బంగారానికి డిమాండ్ లభించే అవకాశం ఉంది. ఫెడరల్ రిజర్వ్ రాబోయే కాలంలో వడ్డీ రేట్లను సడలించే దిశగా అడుగులు వేస్తుందని భావిస్తుంది. 2026లో సుమారు 50 బేసిస్ పాయింట్ల మేర రేటు కోత జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ తరహా నిర్ణయం వస్తే బంగారం వంటి దిగుబడి లేని ఆస్తులకు అనుకూలంగా మారుతుంది.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు మరో బలం
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కూడా బంగారం ధరలకు సపోర్టిస్తున్న కీలక అంశంగా నిలుస్తున్నాయి. 2026లో సగటున 60 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగే ఛాన్స్ ఉదని గోల్డ్‌మన్ అంచనా. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ శక్తి సమీకరణాల్లో మార్పుల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ విదేశీ మారక నిల్వలను పెంచుకునే దిశగా బంగారంపై దృష్టి పెడుతున్నాయి. అయితే, ప్రపంచ ద్రవ్య విధానాలపై అనిశ్చితి గణనీయంగా తగ్గితే, పెట్టుబడిదారులు లాభాల స్వీకరిణకు దిగుతారని గోల్డ్‌మన్ హెచ్చరిస్తోంది. అలా జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషించారు.
బంగారం దిశ ఇదే..
స్థూల ఆర్థిక పరిస్థితులు, సంస్థాగత పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే, భవిష్యత్తులో ప్రపంచ ద్రవ్య విధానాల్లో మార్పులు, పెట్టుబడిదారుల రిస్క్, భౌగోళిక రాజకీయ పరిణామాలపై బంగారం ధరలు ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Note:
నోట్ : ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం.. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.