MLA Lakshma Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు మునిగిపోయారు.. ఇక, అందరికంటే ముందే అభ్యర్థులను ఖరారు చేసిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత దూకుడు చూపించారు.. కేసీఆర్ సూచనలకు మేరకు బీఆర్ఎస్ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఈ రోజు జడ్చర్లలో ప్రజా ఆశీర్వాద సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం అయ్యాయి.. ఇక, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సభ నిర్వహణ కోసం ఎంతో చొరవ తీసుకుంటున్నారు. ఓవైపు ప్రచారం.. మరోవైపు.. ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తూ.. జడ్చర్లలో దూసుకెళ్తున్నారు లక్ష్మారెడ్డి.
ఇక, ఈ రోజు జడ్చర్ల మున్సిపల్ 6వ వార్డు కు చెందిన బుడగ జంగాల సంఘానికి చెందిన యువజన అధ్యక్షుడు మహేష్ సహా 60 మందికి పైగా యువత ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. లక్ష్మారెడ్డి గెలుపు కోసం తామూ కృషి చేస్తామని ప్రకటించారు. మాకు అండగా నిలబడిన లక్ష్మారెడ్డి ఎన్నికల్లో విజయం సాధించేందుకు మేం ముందుంటామని ప్రకటించారు. కాగా, మంగళవారం రోజు జడ్చర్ల పట్టణం లారీ డ్రైవర్లు అసోసియేషన్ సంఘం నుండి 40 మందికి పైగా డ్రైవర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం విదితమే కాగా.. ఉరుకొండ మండలం ఊరుకొండపేటకు చెందిన బీజేపీ నేతలు, మాజీ ఉపసర్పంచ్ పోలే యాదయ్య సహా 20 మంది బీజేపీ నాయకులు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు జహంగీర్ ఆధ్వర్యంలో 10 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం విదితమే.