Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..

Tg Assembly

Tg Assembly

Telangana Assembly: అసెంబ్లీ ప్రాంగణంలో వరుసగా చోటుచేసుకున్న ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో శాసనసభలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా హుందాతనాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ సభ ముగిసే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మాధవరం, మాణిక్‌రావు, చింత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుధీర్‌రెడ్డి, అనిల్‌యాదవ్, గంగుల కమలాకర్‌తో సహా బీఆర్ఎస్ సభ్యులందరినీ ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సస్పెన్షన్ నిర్ణయం వెలువడిన సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ బయట ఉన్నారు. ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన అసెంబ్లీ లోపలికి చేరుకున్నారు. అనంతరం సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తమ నిరసనను వ్యక్తం చేసేందుకు, పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు స్పీకర్‌ను కలవడానికి బయలుదేరారు. అయితే, స్పీకర్ ఛాంబర్ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ మార్షల్స్ దారిలోనే అడ్డుకున్నారు. స్పీకర్ ఛాంబర్ ముందు మార్షల్స్ వారిని నిలిపివేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్షల్స్ చర్యను నిరసిస్తూ ఎమ్మెల్యేలు అక్కడే తమ ఆందోళనను వ్యక్తం చేయడంతో అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.