Telangana Elections 2023: సీఈఓ వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ కలిసింది. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రకటనలపై ఫిర్యాదు చేసింది. మైనంపల్లి హన్మంతరావు కేటీఆర్ పై చేసిన విమర్శల పై సీఈఓకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు అతిక్రమిస్తూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని బీఆర్ఎస్ లీగల్ టీం హెడ్ సోమా భరత్ పేర్కొన్నారు. ఆరు అంశాలపై సీఈఓకు ఫిర్యాదు చేశామన్నారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్లో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు 32 మందిని కొన్నారని.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి లక్షల రూపాయలు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: Harish Rao: రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పచ్చి అబద్ధాలు చెపుతున్నారు
బీఆర్ఎస్ లీగల్ టీం హెడ్ సోమా భరత్ మాట్లాడుతూ..”కర్ణాటక ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే సర్కార్ సొమ్ముతో తెలంగాణలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇవ్వడం కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లే.
రేవంత్ రెడ్డి ప్రచారంలో మాట్లాడే భాషపై మరోసారి ఫిర్యాదు చేశాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషపై 11 వీడియోలు సీఈవోకు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుల పంపిణి కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. మైనంపల్లి హన్మంతరావు విమర్శలపై సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశాం. సరైన సమయంలోనే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ తన అధికారాలను ఉపయోగించి చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరాం. రేపు ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేరుస్తామని అఫిడేవిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తాం. కేటీఆర్ ఇంటర్వ్యూల గురించి ముందస్తు అనుమతి తీసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకపోతే ప్రజల్లోకి వెళ్తాం.” అని ఆయన అన్నారు.