NTV Telugu Site icon

Chalo Nalgonda: నేడు నల్గొండలో బీఆర్ఎస్ సభ.. రైతు గర్జన సభకు కేసీఆర్

Brs Sabha

Brs Sabha

BRS Chief: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్‌ తొలిసారి జనం మధ్యలోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేరుతో బీఆర్‌ఎస్‌ బహిరంగసభ నిర్వహిస్తుంది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర సర్కార్ కు అప్పగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సభ ద్వారా కేసీఆర్ ఎండగట్టాలని చూస్తున్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిన్న (ఫిబ్రవరి 12) అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ ఎలా స్పందించనున్నారు అనేది చూడాలి. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభా వేదికగా గులాబీ దళపతి అల్టిమేటం జారీ చేసే ఛాన్స్ ఉంది.

Read Also: Paytm : పేటీఎంకు షాకుల మీద షాకులు.. పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా

అయితే, అంతకు ముందు, పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ భవన్‌ నుంచి బయలుదేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నల్లగొండ సభకు హాజరుకాబోతున్నారు. కేటీఆర్‌ నేతృత్వంలో నేతలందరూ ప్రత్యేక బస్సుల్లో నల్లగొండకు వెళ్లనున్నారు. కేసీఆర్‌ మాత్రం హెలికాప్టర్‌ ద్వారా నల్లగొండకు చేరుకుంటారు.. సభ అనంతరం తిరిగి హెలికాప్టర్ లోనే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ సందర్శనకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నల్లగొండసభకు కీలక నేతలు హాజరు కావడం ద్వారా ప్రభుత్వ వాదనను తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్‌ చూస్తుంది.

Read Also: JEE Mains Results 2024: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 ఫలితాలు విడుదల!

ఇక, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, వాటికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూరంగా ఉన్నారు. కానీ, నేడు నల్లగొండ సభలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు గర్జన సభలో కేసీఆర్‌ చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించినట్లేనని బీఆర్‌ఎస్‌ శ్రేణులు వెల్లడిస్తున్నారు.

Show comments