అంగుళం భూమి అయినవారి మధ్య చిచ్చుపెడుతోంది. భూమి కోసం అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఆఖరికి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు. తల్లిదండ్రులను సైతం అంతమొందిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూమి కోసం ఓ అన్న తన తమ్ముడి స్నేహితుడిని హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read:Anchor Swecha: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసు.. పూర్ణచంద్ర నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు
సిర్గాపూర్ (మం) ఖాజాపూర్ గ్రామంలో అన్నదమ్ములపైన అన్న హనుమాండ్లు, తమ్ముడు రమేష్ మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరిగి చివరకు మారణాయుధాలతో దాడులకు పాల్పడే వరకు వచ్చింది. భూమి కోసం అన్న హనుమాండ్లు క్షణికావేశంతో విచక్షణ కోల్పోయి తమ్ముడు రమేష్, అతని స్నేహితుడు జైపాల్ పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో జైపాల్(35) అక్కడికక్కడే మృతి చెందగా, రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో జైపాల్ మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.