వర్జిన్ బాయ్స్ టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన చిత్రం. బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ, శ్రీహాన్ సహా గీత్ ఆనంద్, జెనీఫర్ ఇమ్మానుయేల్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమాని గీత్ ఆనంద్ సోదరుడు దయానంద్ డైరెక్ట్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు “టికెట్ కొట్టు, ఐఫోన్ పట్టు” వంటి ఆఫర్లు అందించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ ఆసక్తిని సినిమా ఎంతవరకు క్యారీ చేసింది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
వర్జిన్ బాయ్స్ కథ:
ఓ యూనివర్సిటీలో డూండీ (శ్రీహాన్), ఆర్య (గీత్ ఆనంద్), రోణి (రోనిత్ రెడ్డి) కలిసి చదువుకుంటూ ఉంటారు. కాలేజీలో అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి మాత్రం లేరు అనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న వీరిని వీరి స్నేహితుడు (బిగ్ బాస్ కౌశల్) మరింత రెచ్చగొడతాడు. తాను అమెరికా వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి మీరందరూ వర్జినిటీ కోల్పోవాలని చాలెంజ్ విసురుతాడు. దాన్ని స్వీకరించిన ఈ ముగ్గురు స్నేహితులు ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతారు. డూండీ జెనీఫర్‌తో, ఆర్య మిత్రా శర్మతో, రోణి అన్షులా ధావన్‌తో ప్రేమలో పడతారు. అయితే, ఒక్కరొక్కరుగా వారి ప్రేమలో విఫలమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే, చివరికి ఈ ప్రేమ జంటలు ఒకటయ్యాయా లేదా? వర్జినిటీ కోల్పోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ముగ్గురు వర్జినిటీ కోల్పోయారా లేదా? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సాధారణంగా తెలుగులో అడల్ట్ కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ఈ సినిమా ట్రైలర్ అలాగే ఇతర ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత నిజంగా ఇది అడల్ట్ కామెడీ సినిమా ఏమో అనే ఫీలింగ్ కలిగింది. కానీ, ఒక్కసారి థియేటర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, కాస్త బోల్డ్ జోక్స్ ఉన్నా సరే, అంత అడల్ట్ కామెడీ సినిమా అయితే కాదు. ఈ సినిమా మెయిన్‌గా యూత్‌ని టార్గెట్ చేసి రాసుకున్నారు. నిజానికి, అప్పుడే కాలేజీల్లో జాయిన్ అయిన చాలామందికి తమ స్నేహితులను, సినిమాలను చూసి వర్జినిటీ కోల్పోవాలని లేదా నాకు ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పుకోవాలని కోరిక ఉంటుంది. కానీ, వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమను దక్కించుకోవడం ముఖ్యం అనే ఏకైక లైన్‌తో ఈ సినిమా రాసుకున్నారు. దానికోసం అక్కడక్కడ బోల్డ్ జోక్స్‌తో పాటు స్కిన్ షో చేయించినా, చివరికి ప్రేమే ముఖ్యం, సెక్సువల్ ఫీలింగ్ రావడానికి కూడా ప్రేమే అవసరం అనే పాయింట్‌తో కన్విన్సింగ్‌గా తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. అలా అని ఏదో పెద్ద కథ, కథనాలు ఆశించి సినిమాకి వెళితే నిరాశ చెందక తప్పదు. అమెచ్యూర్ కాలేజీ లవ్ స్టోరీస్‌ను ఒక కథగా కూర్చిన విధానం ఆకట్టుకునేలా ఉంది. అయితే, దీనిలో గతంలో మనం చూసిన మ్యాడ్ లాంటి సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కానీ, ఇందులో పూర్తిగా వర్జినిటీ కోల్పోవడానికి సిద్ధమైన ముగ్గురు యువకుల కథను ఒక సినిమా కథగా మార్చుకున్నారు. కొత్తదనం లేకపోయినా, ఉన్నంతలో యూత్ కనెక్ట్ అయ్యే అంశాలతో కథను నడిపించారు.
నటీనటుల :
సినిమాకి ప్రధానమైన అసెట్ శ్రీహాన్. మనోడి నాచురల్ యాక్టింగ్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. తర్వాత గీత్ ఆనంద్ కూడా చాలా ఈజ్‌తో నటించాడు. రోనిత్ రెడ్డి పర్వాలేదు. ఇక మిత్రా శర్మ బొద్దుగా కనిపించినా, తనదైన శైలిలో నటించింది. జెనీఫర్ ఇమ్మానుయేల్ పర్వాలేదు, అయితే అన్షులా మాత్రం తన పాత్రలో ఒదిగిపోయింది. నటి మధుమణి కుమారుడు ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించాడు. ఇక బంచిక్ బబ్లుకి మంచి పాత్ర దక్కింది. టెక్నికల్ టీం: ఈ సినిమాకి స్మరణ సాయి అందించిన సంగీతం బావుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఇక ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా కట్ చేశారు. సినిమాటోగ్రఫీ సినిమాని చాలా కలర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో ఉపయోగపడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా: వర్జిన్ బాయ్స్ బోల్డ్ కామెడీ విత్ ఎ మెసేజ్.