పాఠశాలల హేతుబద్ధీకరణపై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుధం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా వెనుకబడి పోయాయని, ‘నాడు-నేడు’ పేరుతో విద్యా వ్యవస్థను పతనావస్థకు చేర్చారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మంత్రి లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లరనడం సరికాదని, మంత్రి గారికి ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదని బొత్స పేర్కొన్నారు.
‘ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదు. విద్య ప్రమాణాలు పెంచేందుకు కొత్త సంస్కరణలు తీసుకు వస్తున్నాం. ఐదవ తరగతి పిల్లలు రెండవ తరగతి తెలుగు చదవటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులపై పూర్తిగా దృష్టి పెట్టాం. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి సమస్యలు లేకుండా చూస్తున్నాం. తరగతి గదుల్లో టెక్నాలజీని జోడించి విద్యార్దులకు సులభంగా అర్థమయ్యేలా క్లాసుల నిర్వహణకు చర్యలు చేపట్టాం. వచ్చే ఏడాది నుంచి తల్లిదండ్రులకు విద్యార్ధుల రిపోర్ట్ కార్డులు పంపిస్తాం. నాణ్యమైన విద్యను విద్యార్దులకు అందేలా చర్యలు తీసుకుంటాం. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణం’ అని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.
లోకేష్ వ్యాఖ్యలపై మండలి విపక్ష నేత బొత్స మాట్లాడుతూ… ‘గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళారనటం సరికాదు. మంత్రికి ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భం లేదు. సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదు. సౌకర్యాలపై సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టండి. 2014-19 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి, 2019-24 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దాం. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంది. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రోత్సహించాలన్నదే మా విధానం. ప్రాధమిక విద్య నుంచి టోఫెల్ విద్యను నేర్పించడం.. ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం.. సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈని ప్రవేశపెట్టాం. మొన్న 80% మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చాం. రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరాం. ఈరోజు ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. నేను తప్పు మాట్లాడితే రికార్డుల నుంచి నా మాటలను తొలగించండి. మేం క్షమాపణ చెప్పాలనడమేంటి?, ఎందుకు మేము క్షమాపణ చెప్పాలి?’ అని ప్రశ్నించారు.