Botsa Satyanarayana: విజయవాడలోని గుర్లలో డయేరియా మరణాలకు కూటమి ప్రభుత్వమే కారణమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. డయేరియా బాధితులు ఇంకా మరొకొన్ని గ్రామాలలో ఉన్నారని ఆయన తెలిపారు. 16 మంది డయేరియా బారిన పడి మృతి చెందారన్నారు. అధికారులు ఒకటి రెండు అని చెప్పారని.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10 అని చెప్పారని ఆయన వెల్లడించారు. చనిపోవడానికి బహిరంగ మలవిసర్జన కారణమని ఇప్పుడు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
గత వారసత్వ ద్వారా వస్తున్న లోపాలే ఇప్పుడు సరిచేసుకోవాల్సి వస్తోందని పవన్ అన్నారన్న ఆయన.. గతంలో ఎన్నడూ పదహారు మంది చనిపోయిన దాఖలాలు జిల్లాలో గానీ, చీపురుపల్లిలో గానీ లేవని బొత్స పేర్కొన్నారు. చంపావతి నుంచి సంకిలి వరకు పైప్ లైన్స్ వేసి నీరిచ్చామన్నారు. ఈ రోజుకి పది రోజులైనా నాగలవలసలో మరో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. పది రోజులలో నియంత్రణ చెయ్యకపోతే ఎందుకు ఈ ప్రభుత్వమంటూ ప్రశ్నించారు. వీరంతా సాయం అందకపోవడం వల్లే చనిపోయారని ఆరోపించారు. వరదలలో ముప్పై రెండు మంది కొట్టుకు పోయారన్నారు. రుషికొండ ఏమైనా ప్రయివేటు ప్రాపర్టీనా… ప్రభుత్వానిదే కదా.. కొండపై భవనాలు కట్టాం.. అందులో లోపాలంటే ఎంక్వైరీ చేయించాలన్నారు.
Read Also: Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిధిలో అపచారం.. మద్యం తాగి చిందులు
గుర్లలో ఓ ఉపాధ్యాయుడు ఇప్పుడే చనిపోయారని.. డిప్యూటీ సీఎం వచ్చి వెళ్లాక చనిపోయారని ఆయన తెలిపారు. ఎక్కడ లోపం జరిగింది అన్నదానిపైన ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇంకా ఎంక్వైరీలకు ఎవ్వరో వస్తారట.. అప్పుడు చర్యలు తీసుకుంటారట అంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టులేదని ఆరోపించారు. డయేరియా ప్రబలిన ఏడు గ్రామాలలో సర్వే చెయ్యండని చెబుతున్నామన్నారు. పైప్ లైన్ నిర్వహణ లోపం లేక ఇది జరిగింది.. ప్రతీ వారం దీనిని పరిశీలించాలి… గత నాలుగు నెలల్లో ఎక్కడ శుద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సంక్రాంతి వరకు ఆగాలనుకున్నాం.. ఇలా ప్రాణాలు కోల్పోతుంటే ఇంకెన్నాళ్లు ఆగాలంటూ వ్యాఖ్యానించారు.