Site icon NTV Telugu

Bomb Threat : జైపూర్‌లో హైఅలర్ట్‌.. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంకు బాంబు బెదిరింపు

Jaipur Bomb Threat

Jaipur Bomb Threat

Bomb Threat : ఆపరేషన్ సింధూర్’ విజయంతో దేశమంతా ఉత్సాహంగా ఉన్న వేళ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాత్రం భయానక వాతావరణం నెలకొంది. సవాయ్ మాన్‌సింగ్ (SMS) స్టేడియంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలికి ఈ బెదిరింపు సందేశం మెయిల్ ద్వారా ఉదయం 9:13 గంటల ప్రాంతంలో అందింది. “ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా మీ స్టేడియంలో బాంబు పేలుస్తాం” అంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ ఘటన, భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఒక రోజు తర్వాత చోటుచేసుకుంది.

Rishabh Pant : భాయ్.. డ్రెస్సింగ్ రూమ్ నిన్ను మిస్ అవుతుంది..!

కేవలం 25 నిమిషాల వ్యవధిలో, భారత్ బాలాకోట్ తర్వాత అతిపెద్ద సరిహద్దు దాటి దాడులను నిర్వహించింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో జరిగిన ఈ మెరుపు దాడుల్లో వైమానిక, నావికా , భూతల దళాలు పాల్గొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతీకారంగా చీకటిలో ఈ ఆపరేషన్ జరిగింది. అగ్రశ్రేణి వర్గాల సమాచారం ప్రకారం, నిషేధిత జైషే మహ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT) , హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన దాదాపు 100 మంది ఉగ్రవాదులు ఈ ఖచ్చితమైన దాడుల్లో హతమయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఈ లక్ష్యాలను ఎంపిక చేశామని ప్రభుత్వం ఒక విలేకరుల సమావేశంలో తెలిపింది.

బెదిరింపు మెయిల్ రాగానే జైపూర్ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీసు బలగాలను మోహరించారు. స్టేడియం లోపల ఉన్న వారందరినీ తక్షణమే బయటకు పంపించివేశారు. అంతేకాకుండా, స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్‌లు స్టేడియం లోపల , వెలుపల క్షుణ్ణంగా గాలిస్తున్నారు. నగరంలో భయాందోళనలు నెలకొన్నప్పటికీ, పోలీసులు ప్రజలకు ధైర్యం చెబుతూ భద్రతా చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ విజయం తర్వాత దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.

Missile Attack : అమృతసర్‌ లక్ష్యంగా పాక్‌ మిస్సెల్‌ అటాక్‌.. తిప్పికొట్టిన భారత్‌..!

Exit mobile version