Air India Flight Bomb: ఎయిర్ ఇండియా విమానంలో టిష్యూ పేపర్‌పై రాసున్న నోట్ కలకలం రేపింది. టిష్యూ పేపర్‌పై బాంబ్ అని రాసుండడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అందరూ వెంటనే విమానం నుంచి కిందకు దిగారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏమీ విమానంలో లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎయిర్ ఇండియా విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. వివరాల్లోకి వెళితే…
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి వడోదరకు వెళ్లేందుకు ఎయిరిండియా విమానం (AI-819) బుధవారం రాత్రి 7 గంటలకు సిద్ధమైంది. అంతలోనే విమానం వాష్‌రూంలో బాంబ్ అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ సిబ్బంది (ఎయిర్‌లైన్ సెక్యూరిటీ మేనేజర్) కంట పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సీఐఎస్‌ఎఫ్‌తో పాటు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో.. అధికారులు, విమాన సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Krishnamma OTT: ఎలాంటి ప్రకటన లేకుండా.. వారానికే ఓటీటీలోకి వచ్చేసిన ‘కృష్ణమ్మ’!
‘ప్రయాణికులు అందరినీ సురక్షితంగా కిందకు దించేశాం. భద్రతా సంస్థలు తనిఖీలు చేపట్టాయి. అనుమానాస్పద వస్తువులు ఏమీ లేవు. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. ప్రయాణికులకు వసతి సౌకర్యం కల్పించాం. ప్రత్యేక విమానంలో ప్రయాణికులు వడోదరకు వెళ్లారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది భద్రతకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది.