బాలీవుడ్ వివాదాస్పద నటి పూనమ్ పాండే (32) మృతి చెందారు. సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో పూనమ్ మరణించారు. ఈ విషయాన్ని పూనమ్ పీఆర్ టీమ్ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. గురువారం రాత్రి పూనమ్ మరణించారని ఆమె సన్నిహితులు కూడా మీడియాకు వెల్లడించారు. పూనమ్ మరణ వార్త తెలిసిన ఫాన్స్ షాక్‌కు గురవుతున్నారు. ఆమె మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
‘ఈ ఉదయం మాకెంతో కఠినమైనది. మా ప్రియమైన పూనమ్ పాండేను మేం కోల్పోయాం. గర్భాశయ క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ మరణించారు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపట్ల ఆమె స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను పంచారు. ఈ దుఃఖ సమయంలో పూనమ్ మరణవార్తను షేర్ చేసేందుకు ఎంతో బాధపడుతున్నాం. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం’ అని పూనమ్ పాండే పీఆర్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది.
Also Read: IND vs ENG: లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 103/2! మరోసారి నిరాశపర్చిన రోహిత్
మోడల్‌గా కెరీర్ ఆరంభించిన పూనమ్ పాండే.. 2013లో నషా సినిమాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసారు. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘లాకప్’ తొలి సీజన్‌లో పాల్గొన్నారు. నటన కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పబ్లిసిటీ పొందారు. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్ చాలా పాపులర్ అయ్యారు. పూనమ్ వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమే. పెళ్లైన నెల రోజుల లోపే తన భర్త శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు. పూనమ్ తెలుగులో ‘మాలిని అండ్ కో’లో నటించారు.