‘చంద్రబాబు అన్నా.. తెలుగుదేశం పార్టీ అన్నా నాకు ప్రాణం. ఇతర పార్టీల నేతలు కూడా నాతో మాట్లాడారు కానీ స్పందించలేదు. 14 నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. పక్కన నియోజక వర్గ నేతలకు ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వలేదు. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. దళారీలను పక్కనపెట్టి చంద్రబాబు నేరుగా నివేదిక తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు. వచ్చే నెల 2న నెల్లూరుకు వస్తున్న చంద్రబాబుతో కలుస్తాను. ఆయన ఏమి చెబుతారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఆయన చెప్పిన విషయాన్ని మీ ముందు ఉంచుతాను. మీరు ఏమి చెబితే అది చేస్తా. మనకు అంతా మంచి జరగాలనే ఆశిస్తా. ఎవరు బాధపడాల్సిన పని లేదు’ అని టీడీపీ సీనియర్ నేత బొల్లినేని రామారావు అన్నారు.
‘నా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. టికెట్ ఇవ్వలేమని నాకు ముందే చెప్పి ఉంటే నేను తూచా తప్పకుండా పాటించేవాడిని. కానీ గౌరవించకపోవడం పట్ల బాధ కలుగుతోంది. స్థానిక నేతలు ఎవరికీ తెలియకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నా. 2012 ఉప ఎన్నికల్లోఎవరూ ముందుకు రాకపోతే.. చంద్రబాబు నన్ను పోటీ చేయమన్నారు. అప్పుడు పోటీ చేసి ఓడిపోయా. అప్పటినుంచి సొసైటీ, స్థానిక సంస్థల ఎన్నికలు కోసం ఆర్థికంగా సాయం చేశా. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి.. ఉదయగిరిలో ఎన్నో మంచి పనులు చేశాను. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు సహకారంతో అభివృద్ధి చేశా. నేను ఎక్కడా తప్పు చేయలేదు. రాజకీయాల్లో ఏమీ సంపాదించలేదు’ అని బొల్లినేని రామారావు చెప్పారు.
Also Read: Minister Roja: ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు!
‘నాకు టికెట్టు ఇవ్వకపోవడం వల్ల బాధపడటం లేదు. కానీ నా పట్ల పార్టీ వ్యవహరించిన తీరు పట్ల బాధపడుతున్నా. ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబును కలుస్తాను. నేతలు, కార్యకర్తల ఆవేదనను ఆయన ముందు ఉంచుతాను. నేను వ్యాపారాలు చేసి బాగా సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ జిల్లాలోనే బాగా వెనుకబడిన నా ఉదయగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది నా సంకల్పం. ఎన్నికలకు కేవలం 45 రోజులు మాత్రమే ఉంది. కొత్త వారు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు. నాకంటే కొత్త అభ్యర్థికి ఏమి అదనపు అర్హతలు ఉన్నాయి’ అని బొల్లినేని రామారావు ప్రశ్నించారు.