Bolisetty Srinivas: ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాథం పొలిటికల్ రీ ఎంట్రీపై అనేక ప్రచారాలు సాగుతూ వస్తున్నాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు.. ఆయన కోడలికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగింది.. అయితే, ప్రస్తుతం ఆయనకు వైసీపీలోకి వెళ్లడం ఇష్టం లేదని క్లారిటీ వచ్చింది.. టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరతామని ఆయన కుమారుడే స్వయంగా ప్రకటించారు. ఇక, ముద్రగడతో టచ్‌లోకి వెళ్లారు జనసేన, టీడీపీ నేతలు.. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ నివాసంలో జనసేన పార్టీ నాయకులు ఆయన్ని కలిశారు. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్‌తో సహా పలువురు నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కాపు జాతి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ చెప్పినట్టు జనసేన నేతలు చెబుతున్నారు.
Read Also: Manickam Tagore: చంద్రబాబు, జగన్ పాలన చూశారు.. మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..
ఇక, ముద్రగడ పద్మనాభాన్ని కలిసిన జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముద్రగడని కలిసి జనసేనలోకి ఆహ్వానించామని తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఉద్దేశం తనకి లేనట్టు ముద్రగడ స్పష్టం చేశారన్న ఆయన.. ఉద్యమ నేతగా పవన్ కల్యాణ్ అంటే గౌరవం ఉందని.. త్వరలోనే ఆయన కలిసి మాట్లాడుతానని తెలిపారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో జనసేన, ముద్రగడ కలసి పనిచేయాలని అనే వర్గాలు కోరుకుంటున్నాయి.. మంచివైపు నిలబడితే ముద్రగడకి మరింత మంచి పేరు వచ్చే అవకాశం ఉందన్నారు. కాపు నేతలు ముద్రగడతో పాటు వంగవీటి రాధా కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో లూఠీ జరుగుతోంది.. జనసేన-ముద్రగడ కలిస్తే.. ప్రజలకు కూడా మంచి జరుగుతుందన్నారు జనసేన నేత బొల్లిశెట్టి శ్రీనివాస్.