సీపీఎం జాతీయ నాయకురాలు బృంధాకారత్ బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఊహలు గ్యాస్ బుడగ లాగా ఉన్నాయని.. ఎంతో ఎత్తుకు ఎగిరి గ్యాస్ బుడగ చివరకు పేలిపోతుందని సీపీఎం జాతీయ నేత బృంధాకారత్ అన్నారు. శ్రీకాకులంలో ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన మొదటి రెండు విడతల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పరిస్థితి గ్యాస్ బుడగ వలే ఉందన్నారు. మోడీ కలలు కలలయ్యాయని.. గ్యాస్ బుడగ వలె పేలిపోయాయని.. భారతదేశ ఓటర్లు మోడీ కలలు కలలుగానే మిగిల్చారని విమర్శించారు. బీజేపీ నేతలు అంతా తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారన్నారు. భారతదేశ ప్రధాని అయిన మోడీ మైనార్టీలను టార్గెట్ చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందన్నారు. భారతదేశ ప్రధానులలో ఇంత దారుణంగా ఏ ప్రధాని ఇంతవరకు మాట్లాడలేదన్నారు.
READ MORE: Lok Sabha Elections 2024: పోలింగ్ సరళిని పరిశీలించేందుకు 23 దేశాల నుండి 75 మంది ప్రతినిధులు..
భారత ప్రధాని మీద ఢిల్లీలో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ కమిషనర్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రతి పౌరుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు.. వైసీపీ, టీడీపీ, బీజేపీతో చేతులు కలపడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు నోటికి ఫెవికాల్ రాసుకొని వెళ్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ కోసం ఢిల్లీలో ఒక మాట కూడా మాట్లాడ లేదన్నారు. భారతదేశం మొత్తం మీద బీజేపీ టైర్ పంచర్ అయిపోయిందని.. పంచరైన టైరు తో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీపార్టీ చంద్రబాబు నాయుడు బీజేపీకి స్టెప్నీలా పనిచేస్తున్నారని విమర్శించారు. సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ తో కలసి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు.