BJP Public Meeting LIVE: ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో… రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను అంచనా వేస్తూ అడుగులు వేసే పనిలో పడింది. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీలో పర్యటించారు. శనివారం శ్రీకాళహస్తి వేదికగా జరిగిన సభలో పాల్గొన్న నడ్డా… వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే… ఇవాళ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖలో బహిరంగ సభకు హాజరయ్యారు. అమిత్ షా రెండ్రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇవాళ విశాఖలోని రైల్వే గ్రౌండ్స్‌లో మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వర్గాలు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. దాదాపు 100మంది కూర్చునేలా వేదికను తీర్చిదిద్దగా.. జాతీయ, రాష్ట్ర ప్రముఖులు, 50వేల మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొననున్నారు. అమిత్ షా సుమారు 40 నిమిషాల పాటు ప్రసంగించనుండగా.. గడిచిన 9 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించే అవకాశాలున్నాయి. నిన్న తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహాజన్ సంపర్క్ నిర్వహించగా.. ఇవాళ ఇక్కడ నిర్వహించే సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సహాయ, సహకారాలను వివరించనున్నారు.