Satya Kumar: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలకు సమయం పడుతోన్న సమయంలో.. పొత్తులపై కీలకంగా చర్చలు సాగుతున్నాయి.. ఇప్పటికే.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించగా.. ఇండియా కూటమిగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలో కూడా మరోవైపు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. అయితే, కేంద్రానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తూ వస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? అనే చర్చ కూడా సాగుతోంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతిలో కురుకుపోయిన పార్టీ వైసీపీ… అవినీతి పార్టీలతో బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు.. అయినా.. పొత్తుల అంశం కేంద్రం పార్టీ నాయకత్వం చూసుకుంటుందన్నారు సత్యకుమార్.
ఇక, ప్రజలను హింసిస్తున్న సీఎం జగన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ సెటైర్లు వేశారు సత్యకుమార్.. ఏపీలో సంక్షేమం పేరుతో గాలి మాటలతో పరిపాలన జరుగుతుంది.. గుంతల రోడ్లపై మట్టి పోసిన పాపాన పోలేదు.. తప్పుడు పనులకు మాత్రం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే.. మంత్రులు ట్వీట్ లకే పరిమితం అయ్యారు.. చెల్లికి పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ అన్నట్లు.. చెప్పిందే చెప్పడం. చేసిందే చేస్తున్నారని దుయ్యబట్టారు. క్రీడా స్థలాలు, స్టేడియాలు అభివృద్ధి చేయకుండా.. ఆడుదాం ఆంధ్రా అని మోసం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బయటకు వస్తే.. ప్రజలు మీతో ఫుట్ బాల్ ఆడుకోడానికి రెడీగా ఉన్నారన్న ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలతో ఫుట్ బాల్, ఉద్యోగులతో కబడ్డీ, యువతతో క్రికెట్ ఆడుతుందన్నారు. ఓట్ల విషయంలో జగన్ ప్రభుత్వ మోచేతి నీళ్లుతాగే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. మరోవైపు.. కేంద్రం సహకరించకపోతే.. ఏపీ సంకనాకి పోతుంది అంటూ హాట్ కామెంట్లు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్.