GVL Narasimha Rao: ఏపీలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వబోతోందన్నారు. తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మతుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు. త్వరలో కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఎంపీ జీవీఎల్.. తొమ్మిదేళ్ల కాలంలో రూ. 55 వేల కోట్ల మేర నరేగా నిధులిచ్చిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చే ప్రధాన పథకాల్లో ఏపీకి చేకూరినంత లబ్ధి మరెవరికీ చేకూర్చలేదన్నారు.
Read Also: AP CM Jagan: వైఎస్సార్ యంత్ర సేవ-2 పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఏపీకి ప్రధాని మోడీ సరికొత్త వరాలు ప్రకటించారని.. రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారన్నారు. స్పెషల్ ఇన్సెంటీవ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చారని ఆయన చెప్పారు. ఈ రూ. 10 వేల కోట్ల నిధులు ఏపీ ప్రజలకు వరమన్నారు. రాష్ట్రం ఈ నిధులను కేంద్రం నుంచి గుట్టుగా తెచ్చుకుని తామేదో ప్రజలకు సేవ చేసినట్టు వైసీపీ చెప్పుకుంటోందని ఆయన మండిపడ్డారు. మేం నిధులివ్వకుంటే వైసీపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. 2016 నుంచి ఇప్పటి వరకు రూ. 16,984 కోట్లు అదనపు రుణం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకున్నాయన్నారు. దీంతో కేంద్రం అప్పులపై పరిమితి విధించిందని ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కూడా రూ. 8 వేల కోట్లు కోత విధించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ కోరిక మీదట మూడేళ్లల్లో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించిందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 2667 కోట్ల మాత్రమే కోత విధించి.. సుమారు రూ. 5 వేల కోట్ల మేర రుణ వెసులుబాటు కల్పించామని ఈ సందర్భంగా చెప్పారు.