NTV Telugu Site icon

MP GVL Narasimha Rao: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు..! ఎంపీ జీవీఎల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

MP GVL Narasimha Rao: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి టీడీపీ-జనసే-బీజేపీ కలసి పనిచేసే దశగా చర్చలు సాగుతున్నాయి.. ఇప్పటికే జనసేన-బీజేపీ పొత్తులో ఉండగా.. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య కూడా పొత్తు చిగురించింది.. ఇక, మూడు ఒకేతాటిపైకి రావడమే మిగిలిఉంది.. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చలు జరిపివచ్చారు. ఇక, పొత్తులపై చర్చలు జరుగుతున్నట్టు ఓ దశలో అమిత్‌షా కూడా ప్రకటించారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ జట్టు కట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఈ నేపథ్యంలో.. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి పొత్తుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అని స్పష్టం చేశారు.

Read Also: Kamareddy: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన.. సర్కార్‌ సీరియస్‌..!

ఇక, విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు జీవీఎల్‌.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘాంగా సేవలు అందించిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న రావడం చాలా గొప్ప విషయం అన్నారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వ్యక్తికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. కానీ, బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీలా వ్యత్యాసం లేదు.. దేశానికి వ్యక్తులు అందించిన సేవలతోనే సంబంధం అని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీవీ నరసింహరావు జయంతి రోజు సెలవుగా ప్రకటించాలి, మెమోరియల్ ఏర్పాటు చేయాలి అని డిమాండ్‌ చేశారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయబడింది.. అని చాలా సార్లు చెప్పాను అని గుర్తుచేశారు.. మరోవైపు.. తమ ఉనికి కాపాడుకోవడం కోసం వైఎస్‌ షర్మిల వంటివాళ్లు టీవీల్లో కనిపించడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.