BJP MP Etela Rajender Speech at Secunderabad Ujjani Mahakali Temple: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర కన్నుల పండుగగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించి.. మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు ప్రముఖులు భారీగా హాజరవుతున్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కుటుంబసమేతంగా ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసిన ఈటెల మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ పండితులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలుఅందజేశారు.
బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. స్త్రీలను గౌరవించడం భారతీయ సంస్కృతి. సమాజహితం కోసం చేసేదే బోనాల పండుగ. గోల్కొండ నుండి లాల్ దర్వాజా వరకు కోట్లాది మంది మహిళలు బోనాలు సమర్పిస్తారు. ఆడ బిడ్డలను గౌరవించే విషయంలో దేశంలో ఎక్కడా లేని సంప్రదాయం తెలంగాణలో ఉంది. బతుకమ్మ, బోనాలు, దసరా పండగలలో స్త్రీలను గౌరవించుకుంటాము. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నా’ అని అన్నారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మాజీ మంత్రి మల్లా రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆషాడ మాస బోనాల శుభాకాంక్షలు తెలిపారు. సకాలంలో వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకున్నా అని, సంవృద్ధిగా పంటలు పండి రైతులు ధనవంతులు కావాలని ఆకాంక్షించారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.