Lanka Dinakar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పథకాల కోసం రూ.2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినవే అన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మోడీ మార్క్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. బీజేపీ, టీడీపీ, జనసేన త్రిమూర్తుల కలయికతో రాక్షస సంహారం తథ్యం అని అభివర్ణించారు. ఇక, వివిధ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చాయి.. కానీ, కేంద్రం ఇచ్చిన నిధులు, పథకాలకు పేర్లు మార్చి స్టిక్జర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. గడచిన ఐదేళ్లు నరేంద్ర మోడీ సర్కార్ పంపే నిధులకు బటన్ నొక్కడం తప్ప.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని విమర్శలు గుప్పించారు.
Read Also: CM YS Jagan: వైసీపీ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం
అసలు ‘నాడు – నేడు’ నిధులు ఎక్కడ నుండి వచ్చాయో చెప్పే ధైర్యం ఉందా? రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కార్డులెన్నో చెప్పే దమ్ము ఉందా? అంటూ సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు లంకా దినకర్.. ఇక, అగ్రవర్ణ పేదలకు 10 శాతం EWS రిజర్వేషన్ ప్రధాని మోడీ ఇస్తే, రాష్ట్రంలో అమలు పరచలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. ఒంగోలు వద్ద కొత్తపట్టణం ఫిషింగ్ హార్బర్ ఎందుకు అడుగు ముందుకు పడలేదు? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు అనుమతులిచ్చినా.. నిర్మాణ దశలో ఉన్న కాలేజీలు ఎందుకు పూర్తికాలేదు? అని ప్రశ్నించారు. రూ.9 వేల కోట్లు పంచాయితీల నిధులు దారి మళ్లింపుతో గ్రామాలు అభివృద్ధిలో తిరోగమనం పట్టాయని ఆరోపణలు గుప్పించారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్.