Lanka Dinakar: ఏపీలో సీఎం వైఎస్ జగన్ అస్మదీయుల విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులలో రివర్స్ టెండ”రింగ్” జరిగింది.. జల, సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపు అక్రమాల పైన ప్రశ్నించి 7 నెలలు పైగా గడచినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవిధమైన చలనం లేదన్నారు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం అర్హత లేని కంపెనీలకు రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల నిలువు దోపిడీకి తెరలేపిన జీవోల పైన ప్రశ్నిస్తే ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు.. ఒక్క రాయలసీమలోనే దాదాపు 1.50 లక్షల ఎకరాలు ఈ బినామీ కంపెనీల కోసం దోచే ప్రయత్నంలో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. షిర్డీసాయి ఇంజినీరింగ్ లిమిటెడ్, ఇండోసెల్ కంపెనీలు ఎవరి బినామీ కంపెనీలో తేలాలన్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ మీటర్ల సప్లై నుంచి అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల వరకు అన్ని టెండర్లు అస్మదీయులకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇవ్వడం వెనుక మతలబు ఏమిటి? షిర్డీసాయి ఇంజినీరింగ్ లిమిటెడ్, ఇండోసెల్ కంపెనీలకు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్వహణ అనుభవం ఎంతా? ఆ కంపెనీల నికర పెట్టుబడి సామర్ధ్యం ఎంతా? ఆ కంపెనీలకు కట్టబెట్టిన ప్రాజెక్టులు విలువ ఎంతా? ఇండోసోల్, M/s షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ప్రమోటర్లు ఒకరే కదా.. ఈ కంపెనీలకు విదేశాల నుంచి సూట్ కేస్ కంపెనీల ద్వారా వచ్చే నిధులు ఎవరివో తేలాలి పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఎంవోయూలకు ముందే రాష్ట్ర ప్రభుత్వ జీవోల జారీ చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Read Also: Bandi Sanjya: రాహుల్ కి ఛాలెంజ్.. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేసే దమ్ముందా..!
ఇదేనా రివర్స్ టెండ”రింగ్” అంటే? అని మండిపడ్డారు లంకా దినకర్.. సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ – యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కథ అంతా జగన్ సమ్మోహన రహస్యమే. ఎవరితో మొదలయిన ఒప్పందాలు – ఎవరితో కొనసాగుతున్నాయి, దాని వెనుక ఎవరు? ఆరబిందో రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు 10 వేల ఎకరాలు కట్టబెడుతున్నారని సమాచారం ఉంది.. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న శరాత్చంద్ర రెడ్డి కి సంబంధించిన కంపెనీయే అన్నారు.. ప్రాజెక్టుల ఆమోదానికి జ్యూడిషల్ రివ్యూ అన్నారు కదా ? ఈ కంపెనీలకు సంబందించిన జ్యూడిషల్ రివ్యూ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బహిర్గత పరచగలరా? అని సవాల్ చేశారు. అసలు ఆ ప్రక్రియ జరిగినట్టు ఎక్కడా ఆనవాళ్లు కూడా లేవు. అస్మదీయ కంపెనీలన్నింటికీ కలిపి 3.50 లక్షల ఎకరాల నుండి 4 లక్షల ఎకరాల మేరకు ప్రభుత్వ, ప్రయివేట్ మరియు అటవీ భూములను దోచిపెట్టేందుకు కార్యాచరణ మొదలు అయ్యిందనే అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా తమ డీపీఆర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరంతరం అభ్యర్థిస్తున్నప్పటికీ 45 ఏళ్ల అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ NHPCని కాదని అస్మదీయులకు ప్రాజెక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. NHPCతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫేజ్ 2 అవగాహన ఒప్పందాలు అంటూ కొత్త నాటకం తెరలేపారన్న ఆయన.. సహజ వనరులు, ప్రజా వనరులు విషయంలో ప్రభుత్వాల బాధ్యతలు ఎలా ఉండాలో సుప్రీం కోర్టు వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని ఆరోపించారు ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్.