తెలంగాణలో తప్పకుండా 10 స్థానాలకు పైగా లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల మీడియాతో మాట్లాడారు. ‘‘దేశ ప్రజలు మోడీ పాలనను కావాలని కోరుకుంటున్నారు. ప్రజల ఇచ్చిన తీర్పు వంద శాతం అమలు కాబోతోంది. ఏ సర్వేలు చూసినా 350 నుంచి 370 వరకు బీజేపీకి ఆధిక్యం చూపిస్తున్నాయి. గతంలో ఉన్న 303 సీట్ల క్రాస్ చేసి మెజారిటీ సీట్లు సాదిస్తున్నమని సర్వే సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి. తెలంగాణలో కూడా 8 నుంచి 9 సీట్లు సాధిస్తామని సర్వేలు చెప్పుకొస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌కు అందనంతగా ఫలితాలు సాధించబోతున్నాం.’’ అని ఈటల పేర్కొన్నారు.
‘‘ప్రాణాలు పణంగా పెట్టి వందల మంది తెలంగాణ కోసం బలయ్యారు. లక్షలాది మంది జైళ్ల పాలయ్యారు. తెలంగాణ కావాలని మూడు కోట్ల ప్రజలు సకల జనుల సమ్మె చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. ఏ కళల కోసం, ఏ ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నామో అవి నెరవేరకపోవడం బాధాకరం. అనేక అవమానాలకు గురి చేసి చివరకు ఫోన్ ట్యాపింగ్‌లు చేసి కృంగి పోయేలా చేశారు. గత పాలకులను వద్దనుకొని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది. ఆరు నెలల్లోనే ఎండిపోయిన పొలాలు, పంటలు, కరెంట్ కోతలు, రైతుల చావులు కనిపిస్తున్నాయి. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నిరాశే మిగిల్చింది.’’ అని ఆరోపించారు.
‘‘ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎక్కడికెళ్లినా పంటలెండిపోవడం.. మోటార్లు కాలిపోవడం.. ట్రాన్స్ ఫార్మర్‌లు కాలిపోతున్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. గతంలో కూడా కేసీఆర్ బూకాయించే ప్రయత్నం చేశారు. 24/7 కరెంట్ అనేది కల అని, బుకాయించే పని చేయొద్దని కేసీఆర్‌కు చెప్పినం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే బుకాయించే పద్ధతి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫాల్స్, బోగస్ మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు..?’’ అని ఈటల అన్నారు.