Bypoll Results 2022: దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తన హవా కొనసాగించింది. మొత్తం 7స్థానాల్లో ఎన్నికలు జరగగా.. బీజేపీ 4 సీట్లను కైవసం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోకరనాథ్, హర్యానాలోని ఆదంపూర్‌లో, బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో బీజేపీ విజయం సాధించింజి. ఆర్జేడీ పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ సొంత జిల్లాలో ఉన్న బీహార్‌లోని గోపాల్‌గంజ్ అసెంబ్లీ స్థానాన్ని కూడా కమలం పార్టీ నిలుపుకుంది.ఒడిశాలోని ధామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి సూర్యబన్షి సూరజ్ గెలిచినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ధామ్‌నగర్‌లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేకెత్తించింది.
మరోవైపు మొకామా అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్) 16,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందగా, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ముంబైలోని అంధేరీ ఈస్ట్ సీటును 67,000 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకుంది. తెలంగాణలోని మునుగోడులో తెలంగాణ రాష్ట్ర సమితి స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో గోలా గోకరనాథ్ నియోజకవర్గంలో 1,24,810 ఆధిక్యంతో ఘనవిజయం సాధించిన బీజేపీ అభ్యర్థి అమన్‌గిరిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందించారు. హర్యానాలోని ఆదంపూర్‌లో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయి 15,740 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్ సింగ్ మరణించడంతో గోపాల్‌గంజ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి కుసుమ్ దేవి పోటీ చేసి, విజయం సాధించారు. దీంతో బీజేపీ తన స్థానాన్ని తాను నిలబెట్టుకున్నట్లయింది. ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై కుసుమ్ దేవి సుమారు 1,800 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మొకామా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సతీమణి నీలం దేవి విజయం సాధించారు. అనంత్ కుమార్ సింగ్‌పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. నీలం దేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోనం దేవిపై దాదాపు 16,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పడిపోగా.. బీజేపీ, ఏక్ నాథ్ షిండే అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత మహారాష్ట్రలో తొలిసారిగా ఉప ఎన్నిక జరుగుతోంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ సీటు నుంచి ఉద్ధవ్ ఠాక్రే శివసేన తరఫున లత్కే భార్య రుతుజా లత్కే బరిలో నిలిచారు. ప్రస్తుతం ఆమె భారీ విజయం సాధించింది. భారీ మెజారిటీ దక్కించుకున్నారు. ముందుగా ఈ సీటు నుంచి బీజేపీ తరపున ముర్జీ పటేల్ నిలుచుందాం అని అనుకున్నా.. చివరకు పోటీ నుంచి తప్పుకోవడంతో రుతుజా లత్కే విజయం దాదాపుగా ఖరారైంది. ఉద్దవ్ ఠాక్రే శివసేన అభ్యర్థికి కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా మద్దతు ఇచ్చాయి. 66,247 ఓట్లను సాధించారు లత్కే. ఆమె తర్వాతి స్థానంలో 12 వేల ఓట్లతో నోటా నిలిచింది.
Kunamneni Sambasiva Rao : కేసీఆర్ నాయకత్వం ఈ దేశానికి అవసరం
ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వాలకు బలం చేకూర్చనున్నప్పటికీ.. హర్యానాలో కుటుంబ వారసత్వం కోసం, తెలంగాణ, బీహార్, మహారాష్ట్రలలో ప్రతిష్ట పోరాటాలుగా పరిగణించబడ్డాయి. మరోవైపు ప్రాంతీయ పార్టీలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ఈ ఎన్నికలు కీలకంగా నిలవనున్నాయి. ఈ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), రాష్ట్రీయ జనతాదళ్ (RJD), సమాజ్‌వాదీ పార్టీ (SP), బిజూ జనతాదళ్ (BJD) వంటి ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది.