Bihar Spurious Liquor News: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టిస్తోంది. బిహార్‌లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. సివాన్ జిల్లాలోనే ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సివాన్ ఎస్పీ అమితేష్ కుమార్ తెలిపారు. మరో 10-15 మందికి పాట్నాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
సారణ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చాప్రా పట్టణం ఎస్పీ కుమార్ ఆషిశ్ తెలిపారు. సివాన్, సారణ్ జిల్లాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సిట్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎనిమిది మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: Virat Kohli: ఎనిమిదేళ్ల తర్వాత బరిలోకి.. గుడ్డు పెట్టిన విరాట్ కోహ్లీ!
అక్టోబరు 15న సివాన్, సారణ్ జిల్లాలకు చెందిన కొందరు కల్తీ మద్యం తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ బీట్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. బిహార్‌లో మద్యం విక్రయాలపై 2016లోనే నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ మద్యం కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు.