బిహార్‌లోని షేక్‌పురా జిల్లాలో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూపీఎస్సీ (UPSC) పరీక్ష పాసయ్యానని అబద్ధం చెప్పి, ఊరి మొత్తాన్ని నమ్మించి, చివరకు అడ్డంగా దొరికిపోయిన ఒక యువకుడి కథ ఇది. అసలేం జరిగిందంటే.. షేక్‌పురా జిల్లాలోని ఫతేపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్, తాను యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో విజయం సాధించానని.. ఐఏఎస్ (IAS) అధికారిని అయ్యానని ఊరిలో ప్రచారం చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో.. ఆ యువకుడికి అభినందనలు వెల్లువెత్తాయి. స్థానిక ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే విజయ్ సామ్రాట్ స్వయంగా రంజిత్ ఇంటికి వెళ్లి.. అతడికి పూలమాలలు వేసి, బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఆ ఊరిలో పండగ వాతావరణం నెలకొంది. అంతటితో ఆగకుండా.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రంజిత్‌కు ఎస్‌హెచ్‌ఓ (SHO) కూడా లడ్డూలు తినిపించి ఘనంగా సన్మానించారు.
Also Read:Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది..? నిపుణులు ఏమంటున్నారంటే..
బయటపడ్డ అసలు నిజం..
ఈ సంబరాలు జరుగుతుండగానే.. ఊరిలోని కొంతమంది యువకులకు అనుమానం వచ్చి యూపీఎస్సీ అధికారిక ఫలితాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేశారు. ఆలిండియా ర్యాంక్ 440 సాధించింది కర్ణాటకకు చెందిన ‘రంజిత్ కుమార్ ఆర్’ అని, బీహార్‌కు చెందిన ఈ రంజిత్ కుమార్ కాదని వారికి అర్థమైంది.
పరారైన రంజిత్..
ఈ విషయం తెలియడంతో పోలీసులు రంజిత్‌ను తన అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని స్టేషన్‌కు రమ్మని పిలిచారు. అసలు విషయం బయటపడిందని గ్రహించిన రంజిత్.. వెంటనే తన ఇంటి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూడా, సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను వెంటనే డిలీట్ చేశారు.
Also Read:Hyderabad: అందుబాటులోకి మరో అర్బన్ పార్క్.. గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటన..
ఇలాంటి సంఘటనలు మరిన్ని..
యూపీఎస్సీ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి మరికొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. భోజ్‌పూర్ జిల్లాలో ఒక వ్యక్తి తాను 301వ ర్యాంక్ సాధించానని చెప్పుకోగా.. యూపీలోని మరొకరు 113వ ర్యాంక్ తమదేనని తప్పుగా భావించారు. కానీ తర్వాత ఆ ర్యాంకులు వేరే వ్యక్తులకు వచ్చినవని స్పష్టమైంది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన రంజిత్, ఢిల్లీలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. పోలీసులు రంజిత్ కావాలనే ఈ అబద్ధం చెప్పాడా లేక ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.