ఈ మధ్య ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సార్వత్రిక ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే ఇటీవల ఒడిషా ప్రభుత్వం కూడా డిగ్రీ విద్యార్థులకు రూ.9 వేలు, షెడ్యూల్ తెగల విద్యార్థులకు రూ.10 వేలు స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఇక కేరళ సర్కార్ అయితే మంచినీళ్లు తాగేందుకు విద్యార్థులకు వాటర్ బ్రేక్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో రాష్ట్రం కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు స్కూళ్ల టైమింగ్స్‌ను కుదిస్తూ నితీష్ కుమార్ ప్రభుత్వం (CM Nitish Kumar) ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న ఎనిమిది గంటల పాఠశాల వ్యవధిని తగ్గిస్తామని గతంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీకి (Bihar Assembly) హామీ ఇచ్చారు. తాజాగా సమయాలపై శాసనసభలో రగడ చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి నితీష్.. సమయాలను మార్చాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు విద్యా శాఖ పాఠశాల సమయాలను (Change In School Timings) సవరించింది. పాఠశాల సమయాన్ని ఆరు గంటలకు తగ్గించింది. సవరించిన సమయాలను అనుసరించి, ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కన్హయ్య ప్రసాద్ శ్రీవాస్తవ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సమయాలు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ పేర్కొంది.
స్కూళ్ల సమయాలను నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ వెల్‌లోకి ప్రవేశించి అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. దీంతో నితీష్ కుమార్ హామీని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యా కార్యకలాపాలకు సంబంధించి పాఠశాలల సమయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉండాలని… ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండకూడదని సీఎం తెలిపారు.