బిగ్ బాస్ సీజన్ 6లో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు మూడు రోజుల క్రితం బిగ్ బాస్ తన పుట్టిన రోజు అని చెప్పి, తనను ఇంప్రస్ చేయమంటూ కంటెస్టెంట్స్ ను కోరాడు. అతనికి ఎంటర్ టైన్ మెంట్ అందించే క్రమంలో కంటెస్టెంట్స్ చేసిన విపరీత చేష్టలు చూస్తే ఎవరికైనా పిచ్చెక్కడం ఖాయం. ఎవరికి వారు తాము అందిస్తోంది వినోదం అనే భ్రమతో వ్యూవర్స్ సమయాన్ని కిల్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే… ఆ రెండు రోజులు బిగ్ బాస్ హౌస్ పిచ్చివాళ్ల స్వర్గంగా మారడంతో చూసేవారికి నరకంలా అనిపించింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ తోనూ బిగ్ బాస్ కాస్తంత రూడ్ గా ప్రవర్తించాడు. కేక్ ఇచ్చి… అది ఎవరి తినాలో సరైన సమయంలో నిర్ణయించుకోని కారణంగా దానిని వెనక్కి తీసేసుకున్నాడు. తనను హౌస్ లో ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతున్న ఇనయాను ఓదార్చే క్రమంలో ఆమెకు ప్రత్యేకంగా కేక్ ఇచ్చి, నచ్చిన వాళ్ళకు పెట్టుకోమనే ఆప్షన్ ఇచ్చాడు.
గురువారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఎవరికి వారు మహానటి / నటుడు అనిపించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి నెలరోజులు పూర్తి కావడంతో తమ వాళ్ళపై వీళ్ళందరికీ బెంగ ఉండటం సహజమే. దానికి తగ్గట్టుగానే విషింగ్ వెల్ ముందు తమ కోరికలను ఏకరువు పెట్టమని బిగ్ బాగ్ చెప్పగానే అందరూ దాదాపు కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్యామిలీకి అంతగా ప్రాధాన్యమివ్వని గీతూ తన కుక్కపిల్లలను తలుచుకుంది. బిగ్ బాస్ బర్త్ డే సందర్భంగా ఎక్కువ వినోదాన్ని పంచిన వారిలో ఆరుగురిని ఎంపిక చేయమని కెప్టెన్ కీర్తికి చెప్పగా ఆమె ఫైమా, బాలాదిత్య, రేవంత్, గీతు, సూర్య, రాజ్ పేర్లు ప్రకటించింది. దాంతో ఈ ఆరుగురిని కెప్టెన్సీ టాస్క్ కు బిగ్ బాస్ సెలక్ట్ చేశాడు. ఆ తర్వాత జరిగిన ఫస్ట్ ఫేజ్ టాస్క్ లాక్ బ్రేకర్స్ లో సూర్య, బాలాదిత్య, రేవంత్ మొదటి మూడు స్థానాలలో నిలిచారు. అయితే లీకు వీరుల సమాచారం ప్రకారం సెకండ్ టాస్క్ లో విజయం సాధించి కెప్టెన్ గా రేవంత్ ఎంపికయినట్టు తెలుస్తోంది!