NTV Telugu Site icon

Betting Apps : బెట్టింగ్‌ యాప్ప్‌కు ప్రమోషన్‌ చేస్తున్న అగ్రహీరోలపై ఫిర్యాదు..!

Balakrishna Gopichand Prabh

Balakrishna Gopichand Prabh

Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్‌ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహా ఓటీటీ వేదికపై ప్రసారమైన ‘Unstoppable Season 2’ షోలో ఈ యాప్‌కు ప్రమోషన్ ఇచ్చారని మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌లో రామారావు ఇమ్మనేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులో, “ఈ స్టార్ హీరోల ప్రమోషన్ కారణంగా చాలా మంది అమాయక ప్రజలు డబ్బులు పోగొట్టుకున్నారు. లక్షలాది మంది ఆర్థికంగా నష్టపోయారు. అందుకే సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద వీరి పై కేసు నమోదు చేయాలని” ఆయన పోలీసులను కోరారు. బాలీవుడ్‌తో పోటీ పడుతూ, తమ సినిమాల ద్వారా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ హీరోలు, సినిమా, యాడ్స్, ఇతర వ్యాపారాల ద్వారా ఇప్పటికే వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. అయినప్పటికీ, ఇలా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఏమిటి? ప్రజలకు మంచిని అందించాలి గానీ, ఇలా డబ్బు కోసమే ప్రవర్తించడం తగదా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“ప్రజలకు నష్టం వచ్చినా, వాళ్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా, ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేయడం బాధాకరం. వాళ్లు నిజంగా బాధ్యతగల సెలబ్రిటీలు అయితే, వెంటనే స్పందించి ఈ యాప్స్ ప్రమోషన్‌ను ఉపసంహరించుకోవాలి” అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ కేసుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. భారత్‌లో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధితమైనా, విదేశీ సంస్థలు యాప్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖులు వీటిని ప్రమోట్ చేయడం ద్వారా చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. అయితే, సెలబ్రిటీల బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌పై కట్టుదిట్టమైన నియంత్రణ అవసరం అనే డిమాండ్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.

Ponnam Prabhakar : ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి