పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయల ల్లో ఒక బీట్ రూట్ కూడా ఒకటి.. రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్ ఔషధంగా పని చేస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఇకపోతే మూడు నెలల పంట కాలం కలిగిన ఈ పంటకు చల్లని వాతావరణం అవసరం. సారవంతమైన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6-7 ఉండాలి. అధిక క్షార స్వభావం కలిగిన చౌడు నేలల్లో కూడా బీట్ రూట్ సాగు చేయవచ్చు. 18-25 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది…ఈ పంట గురించి మరిన్ని వివరాలు..
ముందుగా నేలను చదునుగా దున్నుకోవాలి.. ఆఖరిసారి దున్నిన తర్వాత పశువుల ఎరువును వేసి బాగా కలియ దున్నాలి..ఎకరాకు 10-12 టన్నుల పశుఎరువు చల్లుకోవాలి. 44కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్, 14కిలోల నత్రజని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. మళ్లీ విత్తిన 25 రోజులకు ఎకరాకు 14 కిలోల నత్రజని, 14కిలోల పొటాష్ ఎరువులను చల్లుకోవాలి. ఎకరాకు 3-4 కిలోల విత్తనం విత్తుకోవాలి.. ఒకవేళ విత్తిన తర్వాత ఎక్కువ మొక్కలు వస్తే వేరే చోట నాటుకోవాలి..
ఈ బీట్ రూట్ మొక్కలు మొలకెత్తిన 20-25 రోజుల వ్యవధిలో కలుపు తీయాలి. మొక్క చుట్టూ మట్టి తిరిగేస్తే గడ్డ పెద్దగా ఊరడానికి ఆస్కారముంటుంది. తెగుళ్లు రాకుండా ముందుగానే విత్తనశుద్ధి చేయాలి. మొలకెత్తిన 60-100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. మేలైన యాజమాన్య పద్దతులను అనుసరిస్తే ఎకరాకు దాదాపు 15 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకేసారి మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా విత్తుకుంటే మంచి డిమాండ్ తో పాటు అధిక లాభాలు కూడా పొందవచ్చు.. ప్రస్తుతం మార్కెట్ లో వీటిని మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది రైతులు ఈ పంటను వేసుకుంటున్నారు.. ఇంకేదైనా ఈ పంట గురించి సందేహాలు ఉంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవడం మంచిది..