NTV Telugu Site icon

Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

Bear

Bear

Mahanandi: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికమైంది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు. ఇటీవల తిరుమలలో మృగాల భయం ఎక్కువ కావడంతో టీటీడీ, అటవీ అధికారులు చిరుతలు, ఎలుగుబంట్లను పట్టుకునేందుకు 300 నిఘా కెమెరాలు, బోనులు ఏర్పాటు చేసి జంతువులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఇప్పడు నంద్యాలలోని మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది.

Also Read: Govt Hospital: జగిత్వాలలో ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం.. పేషెంట్ ను నేలపై పడుకోబెట్టిన సిబ్బంది..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణక్షేత్రమైన మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. అటవీ ఆహారాన్ని వదిలి, వండిన వంటకాలకు ఎలుగుబంటి రుచి మరిగింది. హోటల్ నిర్వాహకులు పారేసిన ఇడ్లీ, వడ, పూరి, అన్నాన్ని ఎలుగుబంటి తింటోంది. వారం నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ ఎలుగుబంటి చక్కర్లు కొడుతోంది. హోటల్ నిర్వాహకులు, యాత్రికులు తినుబండాలను అడవి ప్రాంతంలో వేయవద్దని మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ యజమానులకు ఈవో చంద్రశేఖర్ రెడ్డి నోటీసులను జారీ చేశారు. ఆహార పదార్థాలను రోడ్లపై, బయట వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.

మహానంది క్షేత్రం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆలయ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తోందని, సత్రాల వద్ద పడేసిన భోజనం కోసం అది వస్తోందని ఆలయ అధికారులు వెల్లడించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చినట్టు చెప్పారు. ఎలుగుబంటి సంచారంతో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కారణమేదైనా పుణ్యక్షేత్రాలో క్రూరమృగాల సంచారం ఇటు భక్తులను, అటు స్ధానికులను ఆందోళనుకు గురిచేస్తున్నాయి.