BCCI Meeting on T20 World Cup 24 Today: టీ20 ప్రపంచకప్ 2024 జట్టు ఎంపిక కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు కాగా.. భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉండడంతో.. సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తునాయి. ఈ ఊహాగానాలకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 1న ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నేడు సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది.
భారత జట్టును ఎంపిక చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌లు ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. ఇటీవల ముంబై, ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా దేశ రాజధానిలో ఓసారి సమావేశం కాగా.. ఆదివారం (ఏప్రిల్ 28) కూడా రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక నేడు అహ్మదాబాద్‌లో జరిగే సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో సెలక్షన్ కమిటీ జట్టుపై తుది నిర్ణయం తీసుకోనుంది. టీ20 ప్రపంచకప్ కోసం వెళ్లే 15 మంది ఎవరనేది ఇప్పటికే ఖరారైందని తెలుస్తోంది. కేవలం ఐపీఎల్ 2024 ప్రదర్శన మాత్రమే కాకుండా.. అంతకుముందు ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేశారట.
Also Read: Rishabh Pant: మేం దారుణంగా విఫలమయ్యాం.. ప్రతీ రోజు మనది కాదు: రిషబ్ పంత్
ఐపీఎల్ 2024లో పరుగుల వరదకు కారణమవుతున్న పిచ్‌లకు పూర్తి భిన్నంగా అమెరికా, వెస్టిండీస్‌లలో పిచ్‌లు ఉంటాయి. విండీస్ పిచ్‌లు మందకొడిగా ఉంటాయి. దాంతో లీగ్‌లో బాగా ఆడుతున్న కొందరికి జట్టులో చోటు దక్కకపోవచ్చు. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించడం దాదాపు ఖాయం. దీంతో గిల్‌కు అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ ఎవరికైనా గాయమైతే విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా మారతాడు. కీపర్‌గా రిషబ్ పంత్, సంజు శాంసన్‌లు ఎంపికయ్యే అవకాశాలు మెండు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు జట్టులో ఉండడం ఖాయం. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మయాంక్ యాదవ్ పేస్‌తో ఆకట్టుకుంటున్నప్పటికీ ఫిట్‌నెస్ అడ్డంకిగా మారింది. మెగా టోర్నీ కోసం భారత తొలి బృందం మే 21న బయల్దేరనుంది.