భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్‌లకు సిద్ధమయ్యే విధానంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. ప్రతి టెస్టు సిరీస్‌కు ముందు ఆటగాళ్లు రెడ్ బాల్ క్రికెట్‌కు సరైన రీతిలో సమాయత్తమయ్యేందుకు 15 రోజుల శిక్షణా క్యాంప్‌ను నిర్వహించాలని కెప్టెన్ శుభమన్ గిల్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి సూచించారు. గతంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో, గిల్ ఇచ్చిన ఈ విలువైన సూచనను బిసిసిఐ సానుకూలంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సంబంధించి, సిరీస్ ప్రారంభానికి 18 రోజుల ముందే (జూలై 18న) బిసిసిఐ భారత జట్టును ప్రకటించడం ఈ మార్పునకు నిదర్శనం. అంతేకాకుండా, సిరీస్ ఆరంభానికి ముందే ఆగస్టు 7 నుంచి భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పాల్గొననుంది.
ఈ ఆసక్తికర పరిణామంపై భారత జట్టు మాజీ బ్యాటర్ హనుమ విహారి తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందిస్తూ, సాధారణంగా టెస్టు సిరీస్‌లు ఐపిఎల్ లేదా ఇతర పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన వెంటనే జరుగుతుంటాయని, కానీ ఈసారి జట్టును ఇంత త్వరగా ప్రకటించడం అరుదైన విషయమని తెలిపారు. గిల్ సూచనల మేరకే బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుందని, ఇది జట్టు సన్నాహకానికి ఎంతో తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకమైనదని, ఇక్కడి రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే విన్ పర్సంటేజ్ గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో పాటు శ్రీలంక పర్యటన భారత్ ఫైనల్ అవకాశాలను నిర్దేశిస్తుందన్నారు.
శ్రీలంకలో పిచ్‌లు మందకొడిగా ఉంటూ, స్పిన్‌కు అనుకూలిస్తాయి కాబట్టి స్వదేశంలో ఆ జట్టును ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదని విహారి హెచ్చరించారు. భారత బ్యాటర్లు సాధారణంగా స్వీప్ షాట్లు తక్కువగా ఆడుతారని, శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కోవడానికి వారు స్వీప్ షాట్లపై దృష్టి సారించి తగినంత ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ఈ సిరీస్ కోసం శుభమన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్ వంటి కీలక ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.

