తెలంగాణలో అందరికి ఇష్టమైన పండుగ ‘బతుకమ్మ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బతుకమ్మ పాటల్లో తెలంగాణ భాష తియ్యదనం ఉంటుందని.. బతుకమ్మలో పేర్చేవి తోట పువ్వులు కాదు, బాట పువ్వులు అని చెప్పారు. పూలనే దేవతలుగా పూజించే పండుగ బతుకమ్మ అని.. బతుకమ్మకు గుడి లేదు, మంత్రాలు లేవు, పూజారి ఉండడు అని ఎమ్మెల్సీ దేశపతి చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్లో ఈరోజు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా నాయకులు బతుకమ్మ పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండగ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.
బతుకమ్మ పండుగను మాజీ సీఎం కేసీఆర్ గొప్పగా నిర్వహించారని, ఈసారి మూడు బతుకమ్మ పాటలు ప్రత్యేకంగా రాయించాం అని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చెప్పారు. బతుకమ్మ పండుగకు కేసీఆర్ ఆడబిడ్డలకు చీరలు కానుక ఇచ్చారని, ఆదివాసులు కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు అని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తెలిపారు. లంబాడీలు తీజ్ పండుగను ఘనంగా జరుపుకుంటారని, ఇప్పుడు బతుకమ్మను కూడా ఘనంగా జరుపుకుంటున్నారని, బతుకమ్మ పండుగ కోసం లంబాడీ ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని మాజీ ఎంపీ మలోతు కవిత పేర్కొన్నారు.
‘పేద, గొప్ప, కులాలకు అతీతంగా జరిగేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ, బోనాలు కూడా తెలంగాణ ఉద్యమ రూపం తీసుకున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మ ఆడుకునే అవకాశం కేసీఆర్ ఇచ్చారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే’ అని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. ‘మార్పు అంటే తెలంగాణ తల్లి, చేతిలో బతుకమ్మ పోతుందనుకోలేదు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి వృద్ధురాలి వరకు కేసీఆర్ పథకాలు అమలు చేశారు. కన్నతండ్రిలా ఆడబిడ్డల గురించి కేసీఆర్ ఆలోచించారు’ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పుకొచ్చారు.
Also Read: Mynampally Hanumanth Rao: మనమే నష్షపోతాం.. మార్వాడీ హటావో నినాదానికి నేను వ్యతిరేకం!
తెలంగాణ రాష్ట్ర సంస్క్రృతీ సంప్రదాయలకు, ఆచారాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. పూలనే అమ్మవారిగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఏటా మహాలయ అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి. సెప్టెంబర్ 21 నుంచి బతుకమ్మ పండుగ ఆరంభం కానుంది. సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఇక దసరా అక్టోబర్ 2న జరగనుంది.