Wimbledon 2024 Final Winner is Barbora Krejcikova: చెక్ రిపబ్లిక్ ప్లేయర్ బార్బోరా క్రెజికోవా తొలిసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ మరియు క్రోకెట్ క్లబ్‌లో హోరాహోరీగా సాగిన ఫైనల్లో 6-2, 2-6, 6-4 తేడాతో ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావోలిపై విజయం సాధించింది. దాంతో వింబుల్డన్ కొత్త రాణిగా క్రెజికోవా అవతరించింది. విజయం అనంతరం స్టాండ్స్‌లోకి వెళ్లిన క్రెజికోవా.. కుటుంబ సభ్యులు, కోచ్‌లతో తన సంతోషాన్ని పంచుకుంది.
తొలి సెట్ మొదటి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన బార్బోరా క్రెజికోవా దూకుడు ప్రదర్శించింది. రెండుసార్లు జాస్మిన్ పావోలి సర్వీస్‌ను బ్రేక్ చేసి.. 5-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో సెట్‌ను 6-2తో సొంతం చేసుకుంది. పావోలిని రెండో సెట్‌లో పుంజుకుంది. డ్రాప్, క్రాస్‌కోర్టు షాట్లతో అలరించింది. అద్భుత ఆటతో 2-6తో సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక సెట్‌లో ఇద్దరు గట్టిగా పోరాడారు. ఓ దశలో స్కోరు 3-3తో సమమైంది. ఈ సమయంలో అనవసర తప్పిదాలు చేసిన పావోలి.. మూల్యం చెల్లించుకుంది. 2021 ఫ్రెంచ్ ఓపెన్‌లో క్రెజికోవా విజేతగా నిలిచింది.