ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..

Roko D

Roko D

బాంగ్లాదేశ్ యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సెప్టెంబర్‌లో భారత క్రికెట్ జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు తమ దేశం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఎలాంటి విభేదాలనైనా, దూరాలనైనా ‘స్పోర్ట్స్ డిప్లొమసీ’ (క్రీడా దౌత్యం) ద్వారా సమర్థవంతంగా తొలగించవచ్చని తాను బలంగా నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆగస్టు-సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో భారత జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించనున్నట్లు బాంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించింది. వాస్తవానికి ఈ పర్యటన 2025లోనే జరగాల్సి ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య తలెత్తిన దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది. గతంలో ఏర్పడిన పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా అప్పటి యూనస్ ప్రభుత్వం భారతదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనకుండా వెనక్కి తగ్గింది. దీంతో ఈ ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఈ నెల ప్రారంభంలో భారత్ సిరీస్ కోసం బీసీబీ టెలివిజన్, మీడియా హక్కుల విక్రయాన్ని ప్రారంభించడంతో పర్యటన మళ్లీ పట్టాలెక్కినట్లు సంకేతాలు వచ్చాయి. ఆగస్టులో భారత జట్టు శ్రీలంక పర్యటన షెడ్యూల్‌లో టీ20 మ్యాచ్‌లు లేకపోవడం కూడా బాంగ్లాదేశ్ టూర్‌కు మార్గం సుగమం చేస్తుందని భావించారు. అంతేకాకుండా, అవసరమైతే భారత జట్టు కోసం భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేస్తామని బీసీబీ స్పష్టం చేసింది. కానీ, హఠాత్తుగా మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను బీసీబీ నిలిపివేయడంతో మళ్లీ అయోమయం నెలకొంది.

ఈ నేపథ్యంలో మంత్రి అమీనుల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం క్రీడా దౌత్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. విశ్వక్రీడలలో క్రికెట్ బాంగ్లాదేశ్‌కు ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, భారత్‌కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే భారత రాయబార కార్యాలయంతో చర్చలు జరిపినట్లు చెప్పారు. గతంలో జరిగిన చిన్న చిన్న సంఘటనల వల్ల ఏర్పడిన ఉద్రిక్తతలను ఈ సిరీస్ ద్వారా తొలగించుకుంటామని, పొరుగు దేశంతో క్రీడలు, కమ్యూనికేషన్ బంధాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రపంచకప్ నుండి వైదొలగడానికి దౌత్యపరమైన వైఫల్యమే కారణమా కాదా అనే అంశంపై విచారణకు బాంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ సిరీస్ కన్‌ఫామ్ అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరో నెలలోనే గ్రౌండ్‌లో కనిపించనున్నారు.