T20 World Cup: టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను తాము భారతదేశంలో ఆడలేమని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(BCB), అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ను కోరింది. అయితే, ఐసీసీ అలాంటిది జరగదని తేల్చి చెప్పింది. దీంతో, బంగ్లాదేశ్ ఈ టీ20 వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్తామని చెప్పింది. ఇదిలా ఉంటే, తాజాగా చివరి ఆశలో బంగ్లా క్రికెట్ బోర్డు మరోసారి ఐసీసీని సంప్రదించింది. ఐసీసీ స్వతంత్ర వివాద పరిష్కార కమిటీ జోక్యాన్ని కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం.
Read Also: Phone Tapping Case: కేటీఆర్ సిట్ విచారణ.. తెలంగాణ భవన్లో కాసేపట్లో ప్రెస్‌మీట్!
నివేదికల ప్రకారం, ఐసీసీ తమ లేఖపై స్పందించి, వేదిక మార్పు కోసం తమ డిమాండ్‌ను వివాద పరిష్కార కమిటీ(DRC)కి సూచిస్తుందని బీసీబీ ఆశాభావంతో ఉంది. డీఆర్సీ స్వతంత్ర న్యాయవాదులతో కూడి ఉంటుంది. ఇది ఐసీసీకి సంబంధించిన వివాదాలను పరిష్కరించే మధ్యవర్తిత్వ సంస్థ. ఇది ఇంగ్లీష్ చట్టాల ప్రకారం పనిచేస్తుంది. దీని విచారణ లండన్‌లో జరుగుతుంది. డీఆర్సీ కేవలం అప్పీళ్ల కోసమే కాకుండా, ఇది ఐసీసీ నిర్ణయాల చట్టబద్ధతను కూడా అంచనా వేస్తుంది.
టీ20 ప్రపంచ కప్ కోసం తమ మ్యాచ్‌లను భారతదేశం నుండి తరలించాలన్న బీసీబీ అభ్యర్థనను ఐసీసీ బుధవారం తిరస్కరించింది. దీని తర్వాత భారత్‌లో ఆడకూడదనే నిర్ణయానికి బీసీబీ కట్టుబడి ఉందని దాని అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ గురువారం ప్రకటించారు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, బంగ్లాదేశ్ తన టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. భారత్-బంగ్లా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలను చూపుతూ, భారత్ నుంచి తమ మ్యాచ్‌లను తరలించాలని బంగ్లా కోరుతోంది.