Bandi Sanjay: కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు. తనను ఓడించాలనే లక్ష్యంతో ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్ల పక్షానే ముస్లింలు ఓటేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇకనైనా హిందూ సమాజమంతా ఆలోచించుకోవాలని సూచించారు. ఈరోజు సాయంత్రం ఫలితాలు వెలువడిన అనంతరం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
Read Also: Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023 విజేతలు వీరే..
బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోస పడుతున్న ప్రజలను చైతన్యం చేసేందుకు పోరాడింది బీజేపీ అని, లాభపడింది మాత్రం కాంగ్రెస్ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజలను రాచిరంపాన పెట్టిన కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడామని, నాతోపాటు ఎంతోమంది కార్యకర్తలపై కేసులు పెట్టారని, దాడులు చేశారన్నారు. జైలుకు కూడా పంపారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు మమ్మల్ని ఆదరించలేదని.. అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన పీడ విరగడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. బండి సంజయ్ గెలుపోటముల ఆధారంగా పనిచేయడు.. గెలిచినా, ఓడినా పనిచేస్తానని.. నా లక్ష్యం బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని బండి సంజయ్ అన్నారు.
Read Also: Congress CM Candidate: కాసేపట్లో సీఎల్పీ సమావేశం.. సీఎం అభ్యర్థి ఎంపిక!
బండి సంజయ్ మాట్లాడుతూ.. ” అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, మెజారిటీ సీట్లు సాధించిన రేవంత్ రెడ్డికి నా అభినందనలు… కేసీఆర్ కు నేను, రేవంత్ రెడ్డి మాత్రమే టార్గెట్. మా ఇద్దరిని ఎట్లా ఇబ్బంది పెట్టారో తెలుసు.. ఏదైమైనా విజయం సాధించిన కాంగ్రెస్ కు నా శుభాకాంక్షలు. నా కోసం, బీజేపీ కోసం నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కష్టపడి పని చేసిన కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున డబ్బు ఆఫర్ చేసినా పార్టీని వీడలేదు.. బీఆర్ఎస్ అభ్యర్ధి రూ. 200 కోట్లు ఖర్చు చేసిండు… పైగా నేను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారు.. డబ్బు, అధికారం, అంగబలంతో గెలిచారు. నేను ధర్మం కోసం పనిచేసే ధర్మ రక్షుకుడిని. నన్ను ఓడగొట్టేదాకా వెంటబడ్డరు. ఓడగట్టారు… అయినా బండి సంజయ్ కు పోయేదేముంది? గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉంటా… ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటా…బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేశారు… ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి లాభపడాలని చూశారు.. కానీ చివరకు ఏమైంది? బీఆర్ఎస్ ఓడింది.” అని బండి సంజయ్ పేర్కొన్నారు.